ఉత్తర కోస్తాంధ్రను ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్వల్పంగా బలహీన పడింది. మరోవైపు.. తమిళనాడు శ్రీలంక తీరప్రాంతాలను ఆనుకుని నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 3-4 రోజుల్లో ఇది క్రమంగా పశ్చిమ దిశగా కదులుతుందని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో.. రాగల 24 గంటల వ్యవధిలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతోపాటు ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది.
మరోవైపు గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణశాఖ, విపత్తు నిర్వహణశాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర జిల్లాల్లోని నెల్లూరు, ప్రకాశంతోపాటు రాయలసీమలోని చిత్తూరులో ఒకటీ రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్ఫష్టం చేసింది.
ఇదీ చదవండి: KOTAMREDDY SRINIVASULU REDDY: రోడ్డుపై పడుకొని తెదేపా నేత నిరసన