రాష్ట్రంలో 50శాతానికి పైగా ఉన్న బీసీలపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. వైకాపా నాయకులు తీరు వలన రాష్ట్రంలో అనేక మంది బీసీ నాయకులు ఆత్మహత్య చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేకపోవడం వలనే స్థానిక ఎన్నికల్లో 24శాతానికి రిజర్వేషన్ తగ్గించారని మండిపడ్డారు. బీసీలకు చంద్రబాబు అమలు చేసిన 34శాతం రిజర్వేషన్లను తుంగలో తొక్కారని విమర్శించారు.
సీఎంకు లేఖ
బీసీ రిజర్వేషన్ల అంశంపై తెదేపా సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌లో ఇంప్లీడ్ అయ్యి వారి రాజకీయ అవకాశాల పరిరక్షణకు కృషి చేయాలని తెదేపా బీసీ నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కరోనా వైరస్ పట్ల ప్రపంచమంతా ముందు జాగ్రత్త చర్యలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నందున ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం సరికాదన్నారు. ఎన్నికల ప్రచారం ద్వారా కానీ, ఓటింగ్ క్యూలైన్ల ద్వారా కానీ కరోనా వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.
న్యాయం చేయాలి
బీసీలకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీసీ నాయకులు ఆందోళన చేపట్టారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని తెదేపా కార్యాలయం ఎదుట బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతులను దహనం చేశారు. 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి బీసీలకు న్యాయం చేయాలని కోరారు.
నెల్లూరులో ర్యాలీ
బీసీల రిజర్వేషన్లు కాపాడటంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా బీసీ నాయకులు నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు. స్థానిక బైపాస్ రోడ్డు కూడలిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రిజర్వేషన్లు తగ్గిస్తూ వైకాపా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను కాల్చివేశారు.
బీసీలను నట్టేట ముంచింది
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 30శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు నమ్మించి వైకాపా ప్రభుత్వం వారిని నట్టేట ముంచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలోని జీజీహెచ్ సమీపంలోని పూలే విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.
బీసీలకు తీవ్ర అన్యాయం
సీఎం జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్ల విషయంలో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని కడప జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు బత్యాల చెంగల్రాయుడు మండిపడ్డారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్ల విషయంలో 34 నుంచి 24 శాతానికి తగ్గించడం వల్ల రాజకీయ పరంగా సుమారు 16 వేల పోస్టులకు ఎసరు పడిందని తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ఎన్నికలు నిర్వహించడం దారుణమన్నారు.