సినీ పరిశ్రమ కష్టాల్లో ఉందని..సాధ్యమైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు విడుదలయ్యే సినిమాలన్నీ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉన్నాయన్న అల్లు అరవింద్..రాజు తలుచుకుంటే వరాలకు కొదవా అని వ్యాఖ్యానించారు. గత నాలుగు రోజులుగా సినీ పరిశ్రమపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతున్న వేళ..పలువురు నిర్మాతలు మంత్రి పేర్నినానితో సంప్రదింపులు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ప్రచార చిత్ర విడుదల వేదికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రత్యేక విజ్ఞప్తి చేసిన అల్లు అరవింద్..సినీ పరిశ్రమ మాటగా తన విజ్ఞప్తిని పరిశీలించాలని కోరారు. కరోనా నుంచి ప్రజలను రక్షించినట్టుగానే సినీపరిశ్రమను కాపాడాలన్న అరవింద్... పరిశ్రమ విజయవంతంగా కొనసాగాలంటే ముఖ్యమంత్రి జగన్ సహకారం అవసరమన్నారు.
ఇదీ చదవండి