పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిసెంబరు 2020 వరకు ఉన్న బకాయిలను చెల్లించామని విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం) తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. ‘ఇప్పటివరకు చెల్లించిన బకాయిల వివరాలతో ఈనెల 1న అఫిడవిట్ వేశాం. ఆ తర్వాత కూడా చెల్లింపుల విషయంలో కొంత పురోగతి ఉంది. ఆ వివరాలతో అదనపు అఫిడవిట్ వేసేందుకు సమయం ఇవ్వాలని..’ ఆయన కోరారు.
అందుకు అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏలపై యూనిట్ టారిఫ్ ధరలను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ 2019లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు శుక్రవారం జరిగిన విచారణలో ఉత్పత్తి సంస్థల తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోని వివరాల్లో వ్యత్యాసం ఉందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఏజీ అదనపు అఫిడవిట్ వేస్తామని చెబుతున్న నేపథ్యంలో కొంత సమయం ఇద్దామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి: