రాష్ట్రంలోని ఆలయాలు, ప్రార్థనా మందిరాలపై దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలని తెదేపా ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. ఏపీలోని అన్ని ఆలయాలను వెల్లంపల్లి దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలాగే విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వెండి రథానికి అమర్చిన మూడు సింహం ప్రతిమలు అదృశ్యమైన కేసులో మొదట మంత్రి వెల్లంపల్లి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టాలని కేశనేని కోరారు. హిందూ దేవాలయాలపై దాడులను ఖండిస్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య విజయవాడ కేశినేని భవన్లో బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు తెదేపా నేతలు కేశినేని నాని, నెట్టెం రఘురామ్, గద్దె రామ్మోహన్, బొండా ఉమ తదితరులు మద్దతు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిని కేశినేని... వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
'దేశంలో పాలనలో విఫలమైన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలులో సీఎం పూర్తిగా విఫలమయ్యారు. ప్రత్యేక హోదాపై పోరాడతానన్నఆయన... ఇప్పుడు నోరు ఎందుకు మెదపటం లేదు. వ్యక్తిగత అజెండా కోసమే దిల్లీకి వెళ్తున్నారు కాబట్టే పర్యటన విషయాలను ప్రజలకు చెప్పలేకపోతున్నారు. తన కేసుల కోసం పార్లమెంట్లో భాజపా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు'.. అని ఎంపీ కేశినేని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి కేవలం రాజకీయ పునరావాసం కోసం పదవులు కట్టబెడుతున్నారని తెలుగుదేశం నేతలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, బచ్చుల అర్జునుడు, ఆశోక్ బాబులు విమర్శించారు.
ఇదీ చదవండి: బురద రాజకీయాలు మాని వరద బాధితులను ఆదుకోండి: లోకేశ్