పుట్టినప్పుడే ఆశలు లేవన్నారు వైద్యులు.. తల్లిదండ్రులు నిరాశలో మునిగిపోయారు.. కానీ బతికింది. మళ్లీ మూడేళ్లకు కిడ్నాప్ రూపంలో ఆపద ఎదురైంది. బతికి ఉందో లేదోనని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కానీ తిరిగి ఇంటికి చేరింది. నిజామాబాద్ నగరంలో ఓ షాపింగ్ మాల్ వద్ద అపహరణకు గురైన ఆష్క్యా హనీ మూడేళ్ల వయసులోనే రెండుసార్లు ఆపద నుంచి బయటపడి పునర్జన్మను పొందింది. సోషల్ మీడియా, స్థానికుల సహకారంతో పోలీసులు కేసును ఛేదించగా.. పాప సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. పాపకు ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
షాపింగ్‌మాల్ వద్ద అపహరణ
జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన నూరిన్ సుల్తానా, సల్మాన్‌లు తమ మూడేళ్ల కుమార్తె ఆష్క్యాహనీ, కుమారుడితో కలిసి బంధువుల ఇంటికి వచ్చారు. ఈనెల 24న నూరిన్ సుల్తానా సోదరి వివాహం ఉండటంతో నిజామాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేసేందుకు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు షాపింగ్ చేసి చివర్లో బిల్లు చెల్లించేందుకు కౌంటర్లో ఉన్నారు. ఆ సమయంలో పాప తల్లి చేతిని విదిల్చుకుని కాస్త పక్కకు వెళ్లింది. అప్పుడే బురఖా ధరించిన ఓ మహిళ పాపను తీసుకుని వెళ్లిపోయింది. కొద్దిసేపటికి పాప కనపడకపోయేసరికి తల్లిదండ్రులు లోపలంతా వెతికారు. బయటకు వచ్చి చూశారు. కానీ ఎక్కడా కనిపించలేదు. అక్కడున్న సిబ్బందిని, సెక్యూరిటీని అడిగినా ప్రయోజనం లేకపోయింది. చివరకు పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. ఓ మహిళ పాపను తీసుకుని ఆటోలో వెళ్లిపోయినట్లు కనిపించింది. దీంతో తమ కుమార్తె కిడ్నాప్ అయ్యిందని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారి
కేసు నమోదు చేసిన ఒకటో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షాపింగ్ మాల్ నుంచి మొదలు పెట్టి ప్రధాన మార్గాల్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. నగరంలోని బోధన్ బస్టాండ్‌లో మహిళతో పాప కనిపించింది. ఆ తర్వాత మరెక్కడా కనిపించలేదు. దీంతో ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో పాప వివరాలతో కూడిన సమాచారం పోస్ట్ చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజాప్రతినిధులు, స్థానికులతో ఇక్కడి పోలీసులు మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో మూడో రోజు పాప మహారాష్ట్రలోని నర్సిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఓ పెట్రోల్ బంక్ వద్ద పాపను కిడ్నాపర్ వదిలేసి వెళ్లారు. పాపను పోలీసులు తమ సంరక్షణలోకి తీసుకుని అక్కడి నుంచే తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడించారు. ఆ తర్వాత నిజామాబాద్‌కు తీసుకు రాగా.. సీపీ కార్తికేయ పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. పాప సురక్షితంగా కిడ్నాపర్ నుంచి బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రెండు సార్లు పాపకు తప్పిన ఆపద
మూడేళ్ల ఆష్క్యా పుట్టినప్పుడు కేవలం 750 గ్రాములు ఉంది. దీంతో బతుకుతుందో లేదోనని వైద్యులే అనుమానం వ్యక్తం చేయగా.. కుటుంబ సభ్యులకు నమ్మకం లేకపోయింది. కానీ రోజుల తరబడి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆరు నెలల వరకు వైద్యం కొనసాగించడంతో బతికింది. దాదాపు రెండేళ్లకు సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పటికీ కాల్షియం చుక్కలు పాపకు అందించకుంటే ఇబ్బంది తలెత్తుతుంది. అలాంటి పరిస్థితుల్లో మరోసారి పాపకు ప్రమాదం ఎదురైంది. దుండగులు పాపను అపహరించి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు ఎక్కడుందో తెలియని పరిస్థితి తలెత్తింది. అయితే అదృష్టం కొద్దీ మరోసారి పాప ప్రమాదం నుంచి బయట పడింది. పోలీసులు విస్తృతంగా గాలించడంతో కిడ్నాపర్ వదిలేసి పోవడంతో పునర్జన్మ లభించింది. ఇలా మూడేళ్లలోనే రెండు సార్లు ఆపద నుంచి బయట పడింది ఆష్క్యా.
ఏమైనా పోలీసులు సీసీటీవీ కెమెరాలను ఆధారంగా చేసుకుని సరిగ్గా అంచనా వేయడంతో పాపను గుర్తించ గలిగారు. పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారని తెలిసి భయపడ్డ కిడ్నాపర్ ఏమీ చేయకుండా వదిలేసి వెళ్లడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:
Sexual Abuse: లింగభేదాన్ని పక్కనపెట్టేశారు.. మానసిక వికలాంగుడని కూడా చూడకుండా..