పేదోడి సొంతిటి కల సాకారం చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన జగనన్న కాలనీల నిర్మాణం చాలాచోట్ల నత్తనడకన సాగుతోంది. కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు సమీపంలో 47.22 ఎకరాల్లో వేసిన లేఅవుట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దొరపల్లె గుట్ట, ఉడుమాలపాడు గ్రామాల సమీపంలో రెండు లేఅవుట్లు వేసి ప్రభుత్వం.. స్థలాలు పంచింది. గృహాలు కట్టుకోకపోతే స్థలాలు వెనక్కి తీసుకుంటామన్న ఒత్తిళ్లతో లబ్ధిదారులు ముందుకొచ్చారు. కష్టమైనా నిర్మాణాలు మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ల అవస్థలు అన్నీఇన్నీకావు! ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయలేక, అలా మధ్యలో ఆపేయలేక.. అవస్థలు పడుతున్నారు.
జగనన్న కాలనీలకు వెళ్లేందుకు రోడ్లు లేవు. ఫలితంగా ఇంటి నిర్మాణ సామగ్రితరలించడం కష్టంగా మారింది. ఇక ఇంటి నిర్మాణానికి అవసరమైన నీరు లేవు. ఉడుములపాడు లేఅవుట్లో బోర్లు వేసినా.. విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. ఇక దొరపల్లె గుట్ట కాలనీలో అసలు బోరు కూడా లేదు. సమీపంలోని ఓ బావి నుంచి లబ్ధిదారులు నీటిని మోసుకుంటున్నారు. ఇంతకష్టపడినా సకాలంలో బిల్లులు మంజూరు కావడం లేదని లబ్దిదారులు వాపోతున్నారు. మౌలిక వసతులు లేక ఇళ్ల నిర్మాణానికి చాలా మంది వెనకడుగువేస్తున్నట్లు లబ్ధిదారులు చెప్తున్నారు.
ఇవీచదవండి.