రాష్ట్ర ప్రభుత్వం నూతంగా అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసుల స్పందనపై కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎవరితో చెప్పుకోవాలో తెలియని సమస్యలు ఉన్నవారంతా... స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు స్పందించి సమస్యలు త్వరగా స్పందించడంపై... ప్రజలు అభినందిస్తున్నారు.
పెట్టి సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి... బ్యాంకులో పొలం పత్రాలు తాకట్టు పెట్టి 20 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. పూర్తిగా చెల్లించాడు. తనఖా పెట్టిన పత్రాలు ఇవ్వమని అధికారులను కోరితే... ఇవ్వకుండా వేధించారు. పొలం పత్రాలు లేని కారణంగా తన కుమారుడిని చదివించుకోలేకపోతున్నానని... తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. స్పందించిన విజయవాడ నగర కమిషనర్... బ్యాంకు ఏరియా పోలీసులతో మాట్లాడారు. ముందుగా నోటీసులు పంపి... సరైన సమాధానం రాకపోతే కేసు నమోదు చేయాలని సూచించారు. అధికారులతో మాట్లాడి భాదితుల సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
మరో ఘటనలో.. వృద్ధాప్యంలో తండ్రికి ఆసరాగా ఉండాల్సిన కుమారుడు కర్కశంగా మారాడు. ఆస్తి మొత్తం తనకివ్వాలని తండ్రిని వేధిస్తున్నాడు. తండ్రికి సాయం చేస్తున్న సోదరిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. గూడవల్లికి చెందిన అంకరాజుకు 4సెంట్ల స్థలం ఉంది. అందులో 2సెంట్ల స్థలాన్ని కూతురి పేరున రాశాడు. దీంతో కుమారుడు శ్రీనివాస్ తండ్రిని వేధించడం మొదలు పెట్టాడు. వేధింపులు భరించలేని అంకరాజు తన కొడుకు నుంచి రక్షణ కల్పించాలని సీపీకి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన సీపీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గన్నవరం పోలీసులను ఆదేశించారు.
పొలం విక్రయించిన వ్యక్తి తన పేర రిజిస్టర్ చేయకుండా... ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాలకోటి అనే రైతు స్పందన కార్యక్రమంలో సీపికి ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కమిషనర్‌ను కోరాడు.
స్పందన కార్యక్రమానికి భూ వివాదాలు, వృద్ధులకు సంబంధించిన సమస్యలు అధికంగా వస్తున్నాయని సీపీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. భాధితులకు న్యాయం చేసేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు సూచనలు చేస్తున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండీ...