శ్రీవారి భక్తుల మనోభావాలకు విరుద్ధంగా తితిదే నిర్ణయాలు ఉన్నాయని తెదేపా పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల పవిత్రత దెబ్బతీసేలా తితిదే బోర్డు నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. తిరుమల ప్రాభవం తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలను వ్యాపార కేంద్రం చేస్తున్నారన్నారు. టికెట్ లేకుంటే తిరుపతి నుంచి తిరుమలకు పంపటం లేదని ఆరోపించారు. తిరుమలలో కరోనా ఆంక్షలపై భాజపా ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. దేశంలో ఏ గుడిలో లేని కరోనా ఆంక్షలు తిరుమలలో ఎందుకని? నిలదీశారు.
శ్రీవారు ఉన్నచోట మరో స్పిరిచ్యువల్ సిటీ ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.వెయ్యి కోట్లతో దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు కట్టవచ్చునని సూచించారు. జిలేబీ ప్రసాదం రూ.2 వేలు చేసి సామాన్యులకు దూరం చేశారన్నారు. తిరుమల భద్రతపై కమిటీ నివేదికను తుంగలో తొక్కుతున్నారని ఆక్షేపించారు. స్వామివారి ఆలయ వాస్తును దెబ్బతీసేలా తితిదే నిర్ణయాలు ఉన్నాయన్నారు. తిరుమలలో టికెట్ల ధర పెంచుతుంటే ప్రభుత్వం స్పందించదా ? అని పయ్యావుల నిలదీశారు.
తితిదే ధార్మిక మండలిని జగన్ దోపిడీ మండలిగా మార్చారు..
తితిదే ధార్మిక మండలిని జగన్ దోపిడీ మండలిగా మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. శ్రీవారి సేవా టికెట్లను తితిదే సభ్యులే వాటాలు వేసుకుంటున్నారని ఆరోపించారు. వసతి, ప్రసాదం ధర పెంచి సామాన్య భక్తులపై పెనుభారం మోపుతున్నారని ఆక్షేపించారు. క్రిమినల్ కేసులున్న 16 మందిని తితిదే సభ్యులుగా నియమించారని మండిపడ్డారు.
శ్రీవారిని భక్తులకు దగ్గర చేసి ఆధ్యాత్మిక సేవలో తరించాల్సిన పాలకమండలి సభ్యులు వ్యాపారంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల సమీకరణ పేరుతో ఉదయాస్తమాన సేవ రేట్లను కోటి, కోటిన్నరకి పెంచడమే అతి పెద్ద తప్పన్నారు. వీటి బుకింగ్ ప్రారంభించిన వెంటనే సేవా టిక్కెట్లు దళారుల్లా తమలో తామే పంచుకున్నామంటూ బహిరంగంగా ప్రకటించటం సిగ్గుచేటన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలో ఏ ఆలయానికి అడ్డురాని కొవిడ్ నిబంధనలు తిరుపతిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఎందుకు అడ్డొచ్చాయో పాలకమండలి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆలోచన, సమీక్ష లేకుండా తితిదేను కార్పొరేట్ వ్యాపార సంస్థ మాదిరిగా భావిస్తూ.. ఇష్టానుసారంగా అన్ని రేట్లు పెంచేద్దాం అంటూ లైవ్‌లోనే పాలకమండలి చేసిన ప్రతిపాదనలు తిరుమల తిరుపతి పవిత్రతని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు.
ఎంతో వైభవంగా ఉత్సవాలు జరిగే తిరుమలలో ఇప్పుడు అన్ని ఏకాంత సేవలేనని, సీఎం తాడేపల్లి ఇంటి నుంచి బయటకి రారు... కొవిడ్ పేరుతో శ్రీ వారినీ బయటకి రానివ్వటం లేదని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు ఎత్తేసినా ఇంకా కొవిడ్ ప్రోటోకాల్ పేరుతో సామాన్య భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లేకుండా చెయ్యటం వ్యాపారబుద్ధిగల పాలకమండలి కుట్రేనని ఆరోపించారు. హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ పాలకమండలి తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : Tirumala Tickets : శ్రీవారి దర్శన టికెట్లు విడుదల