కరోనా మహమ్మారి వ్యాప్తితో నెలకొన్న దుర్భర పరిస్థితుల నుంచి ప్రజలు బయటపడి సాధారణ జీవనం సాగించాలని... వారికి శారీరక, మానసిక ఆరోగ్యం అందించాలని భగవంతున్ని కోరుకుంటూ చాతుర్మాస దీక్ష చేపట్టారు పవన్ కల్యాణ్. టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలు, జన సైనికులు, వివిధ వర్గాల ప్రజలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న పవన్... పార్టీ మీడియా విభాగం.. సోషల్ మీడియా విభాగాల కోరిక మేరకు గంట పది నిమిషాల పాటు వివిధ అంశాలపై ముఖాముఖిగా మాట్లాడారు. ఈ ముఖాముఖి తొలిభాగాన్ని రేపు విడుదల చేయనున్నట్లు జనసేన నేతలు పేర్కొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జాతీయ, ప్రాంతీయ అంశాలపై తన అభిప్రాయాలను... జనసేన విధానాన్ని సుదీర్ఘంగా వెల్లడించారు పవన్. కరోనా విజృంభణ, ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమ ఆశయం... చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రభుత్వ దృఢ వైఖరి వంటి అంశాలపై తన మనసులో మాటను వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడారు. లాక్‌డౌన్ సమయంలో జనసైనికుల సామాజిక సేవ వంటి అంశాలతోపాటు సినిమాలకు సంబంధించిన వివిధ విషయాలపైనా ముఖాముఖిలో సమాధానం ఇచ్చారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీపై గవర్నర్ నిర్ణయం ప్రజాస్వామ్య విజయం: తెదేపా