రాష్ట్రంలోని ప్రసిద్ధ పంచారామాలతో కూడిన ఐదు తపాల కార్డులను దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లాంఛనంగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ తపాలశాఖ ఆధ్వర్యంలో సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణను పెంపొందించేందుకు ప్రత్యేక కవర్లు, పోస్టు కార్డులను రూపొందించారు. విజయవాడలోని మంత్రి వెల్లంపల్లి నివాసం వద్ద ఈ కార్డులను విడుదల చేశారు. హిందూ సంప్రదాయాలు, దేవాలయాల పేరుతో పోస్ట్‌కార్డులు ముద్రించడం చాలా సంతోషమని మంత్రి వెల్లంపల్లి అన్నారు.
పంచారామాల దర్శనం కార్తికమాసంలో ఎంతో పుణ్యమని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అన్ని దేవాలయాల మాదిరిగానే రాష్ట్రంలోని దేవాలయాలకు కూడా తపాల సేవలు వినియోగించుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ‘పంచారామాస్’ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో తపాల శాఖ ప్రత్యేకంగా ఈ పోస్ట్ కార్డులను రూపొందించింది. ఈ కార్యక్రమంలో చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు, విజయవాడ పోస్టు మాస్టర్ జనరల్ టి.ఎం.లత తదితరులు పాల్గొన్నారు.
ద్రాక్షారామంలో
పంచారామాలు ముద్రించిన పోస్ట్ కార్డులను తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రాజమహేంద్రవరం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సూర్యనారాయణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి కెన్.వి.డి ప్రసాద్ విడుదల చేశారు. పవిత్ర కార్తిక మాసంలో భారత తపాలశాఖ రాష్ట్రంలోని పంచారామాల ఖ్యాతి ప్రచారం కోసం పంచారామాల పోస్ట్ కార్డులు ఆవిష్కరించింది.
ఇదీ చదవండి : ఏలూరును వీడని కలవరం...585కు చేరిన బాధితులు