లోక జనులు ..సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం తెలుగు రాష్ట్రాల్లో దేవదేవుని కళ్యాణాన్ని జరుపుతోంది. విజయవాడలోని మొఘల్ రాజపురం పి.బి.సిద్దార్ధ కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల నుంచి ప్రత్యేక వాహనంలో శ్రీవారి ఉత్సవ మూర్తులను తీసుకువచ్చిన పండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉత్సవ విగ్రహాలను పండితులు సుందరంగా అలంకరించారు. అంకురార్పణతో వివాహ తంతు ప్రారంభమైంది. శ్రీదేవీ, భూదేవీ సమేతుడైన వెంకటేశ్వర స్వామికి ..కళాశాల యాజమాన్యం పట్టువస్త్రాలు సమర్పించింది. వేదమంత్రాలు ధ్వనిస్తుండగా...అర్చకులు హోమాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య.. దేవ దేవుని కళ్యాణాన్ని పండితులు వైభవంగా నిర్వహించారు.
మంగళ వాయిద్యాలు మోగుతుండగా...భక్తుల గోవింద నామస్మరణలు...జయజయ ధ్వానాలు మధ్య ఇద్దరు దేవిలను శ్రీవారు వివాహమాడారు. వివాహ తంతు జరుగుతున్నంత సేపు భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. అన్నమయ్య కళాకారుల ఆలపించిన కీర్తనలు ఎంతగానో అలరించాయి. నయనా నందకర, దివ్యమనోహరమైన స్వామి వార్లను ..భక్తులు కనులారా వీక్షించారు.