New Districts Agitations: కొత్త జిల్లాల ఏర్పాటులో తమ ఆకాంక్షలను పట్టించుకోవాలంటూ ప్రజల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలంటూ.. ఆ ప్రాంతంలో నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. యర్రగొండపాలెంలో.. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో 13 వ రోజు రిలే దీక్షలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ఉద్యోగులు, విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలో పాల్గొన్నారు.
ఐదు నియోజకవర్గాలని కలుపుకొని.. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని.. కనిగిరిలోని పులి వెంకటరెడ్డి పార్కు వద్ద అఖిలపక్షాల ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. మార్కాపురంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట 18వ రోజూ రీలే దీక్షలు చేపట్టారు. మార్కాపురం వచ్చిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు నూతన జిల్లాల నిరసన సెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే నాగార్జునరెడ్డితో కలిసి వెళ్తుండగా.. జిల్లా సాధన సమితి నాయకులు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. జేఏసీ నాయకులను పోలీసులు ఈడ్చి వేయడంతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడలో రాధ రంగ మిత్రమండలి సభ్యులు ఒక రోజు నిరసన దీక్షకు చేపట్టారు. కర్నూలు జిల్లాలోని ఆదోని కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని.. 20వ రోజు నిరసన దీక్ష కొనసాగింది. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. రాజంపేట కేంద్రంగానే అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై రాయలసీమ జిల్లాల కలెక్టర్లతో ప్రణాళిక కార్యదర్శి విజయ్ కుమార్ అనంతపురంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మార్చి 3వ తేదీ వరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై అభ్యంతరాలు, సలహాలు స్వీకరిమన్నామని అధికారులు తెలిపారు. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: