కరోనా వేళ కళ్యాణాలు వార్తల్లో నిలుస్తూ.. సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. నిబంధనలు పాటించక కాదు.. వినూత్నంగా చేసుకుంటూ..! ఆన్లైన్ పెళ్లి, మొబైల్ పెళ్లి అంటూ కొందరు కొత్త పద్ధతుల్లో వివాహాలు చేసుకుంటుంటే.. ఒకే పందిట్లో అక్కాచెల్లెల్లిద్దరిని మనువాడాడు ఓ యువకుడు. ఈ అరుదైన సంఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన గోల్పల వెంకటేశానికి ఇద్దరు కూమార్తెలు.. స్వాతి, శ్వేత ఉన్నారు. పెద్ద కూతురు స్వాతికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్న వెంకటేశం.. కూతురికి తగ్గ జోడి కోసం వెతికాడు. ఈ క్రమంలోనే శివ్వంపేట మండలం పాంబండకు చెందిన బాలరాజును అనుకున్నారు. ఇరు కుటుంబాలు అన్ని విషయాలు మాట్లాడుకుని పెళ్లికి నిశ్చయించారు.

కట్నకానుకలతో పాటు.. వెంకటేశం చిన్న కూతురైన శ్వేత పెళ్లి విషయం కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. శ్వేతకు మతిస్థిమితం లేకపోవటం వల్ల.. ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని బాలరాజును కోరారు. బాలరాజుతో సహా అతని కుటుంబం కూడా ఈ విజ్ఞప్తికి ఒప్పుకోగా.. అక్కాచెల్లెల్ల పెళ్లికి ఒకే ముహూర్తం కుదిర్చారు.
వివాహ పత్రికలో కూడా వధువు స్థానంలో ఇద్దరు అమ్మాయిల పేర్లు రాయించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఆదివారం రోజు.. ఒకే పందిట్లో స్వాతి, శ్వేతకు బాలరాజు తాళి కట్టాడు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ వివాహం జరిగింది.

అప్పగింతల సమయంలో... పెద్ద కూతురు స్వాతిని పెళ్లికొడుకు బాలరాజుతో అత్తారింటికి పంపించగా.. మతిస్థిమితం లేని రెండో కూతురు శ్వేతను మాత్రం పుట్టింటిలోనే ఉంచుకోవడం గమనార్హం.