కరోనా బారిన పడిన వారిలో చాలామంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. వీరిలో యువకులు ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి వారికి కనీస చికిత్స ఎలా అందించాలన్న దానిపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. వీటి అమలుపై వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అంతగా దృష్టి సారించడంలేదు. తప్పని పరిస్థితిలో బాధితులు సొంతంగా, కాస్త పరిజ్ఞానం కలిగిన వారి నుంచి సూచనలు పొంది ఔషధాలు వాడుతున్నారు. కొందరు వైద్యులను ఫోన్లలో సంప్రదిస్తున్నారు.
- 13 జిల్లాల్లో కలిపి 60 వేల మందికి పైగా ఇళ్లల్లోనే ఐసొలేషన్‌లో ఉన్నారు. ఈనెల 21 నాటికి వీరిలోని 13 వేల మంది నుంచి ఏఎన్‌ఎంలు ఆరోగ్య వివరాలు సేకరించారు. 25 వేల మంది బాధితులతో మాత్రమే వైద్యులు మాట్లాడారు. కర్నూలు జిల్లాలో 3,731 మందిని, శ్రీకాకుళం-1336, తూర్పుగోదావరి-1,248 మందిని వైద్యులు పలకరించలేదు. వైద్యారోగ్య శాఖ రికార్డులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
- ఇళ్లల్లోనే ఉంటున్న బాధితులకు వైద్యారోగ్య శాఖ ఉచితంగా మందుల కిట్‌ను అందచేయాల్సి ఉన్నా... సరిగా జరగడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కిట్‌ను రూ.69.90లకు చొప్పున 8.14 లక్షల కిట్లను కొనుగోలు చేసింది. వీటిలో 3.88 లక్షల కిట్స్‌ను జిల్లాలకు సరఫరా చేసింది. క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిస్థాయిలో పంపిణీ జరగడంలేదు.
- పశ్చిమగోదావరి జిల్లాలో 420 మంది హోం ఐసొలేషన్‌లో ఉండగా 300 మందికి కిట్లు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. విజయనగరం, అనంతపురం జిల్లాల్లోనూ కిట్లు ఇవ్వడం లేదు. ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ కూడా లేదు. సొంతంగా కొనుగోలు చేసిన మందులనే వాడాల్సిన పరిస్థితి నెలకొంది.
- కృష్ణా జిల్లాలో సైతం హోం ఐసొలేషన్‌లో ఉంటున్న వారికి కొవిడ్ మందులివ్వడం లేదు. విజయవాడలోని దంతవైద్య కళాశాలలో ‘ట్రయేజ్’ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ పరీక్షలు చేయించుకొన్న బాధితులకు వెంటనే కిట్లు అందచేస్తున్నారు. ఇదే విషయమై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... ‘కిట్లలో రెండు రకాల మందు మాత్రలను మారుస్తున్నాం. అందుకే కొంత ఆలస్యం అవుతోంది. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి ఎక్కడైనా వైద్యం అందకుంటే మాకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ విషయమై క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేస్తున్నాం’ అని వివరించారు.
ఇదీ చదవండి: ముడిపదార్థాల కొరత- టీకాల ఉత్పత్తికి అవరోధం