కరోనా ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందులుపడుతున్న పారిశ్రామిక రంగానికి చేయూత కోసం ‘ఆత్మనిర్భర్ భారత్’ కింద అదనంగా 20 శాతం ఇవ్వాలని బ్యాంకులను కేంద్రం ఆదేశించింది. దీని కోసం 3 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. వివిధ కారణాలను చూపుతూ బ్యాంకులు రుణ పరిమితి పెంచటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజీ ప్రయోజనాలు కూడా పూర్తి స్థాయిలో పరిశ్రమలకు అందలేదు. రాష్ట్రంలో 97 వేల ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. వాటికి కొల్లేటరల్ సెక్యూరిటీతో సంబంధం లేకుండా 20 శాతం అదనపు రుణాన్ని ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. కానీ, బ్యాంకులు అది కచ్చితంగా కావాలని డిమాండ్ చేస్తున్నాయి.
పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమికి సంబంధించి ఏపీఐఐసీతో కుదుర్చుకున్న ఒప్పందం ఆధారంగా రుణాన్ని తీసుకున్నారు. కరోనా పరిస్థితుల్లో వాటి రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదు. ఇలాంటి వాటికీ బ్యాంకర్లు రుణ పరిమితి పెంచటం లేదు. కొద్ది మొత్తంలో పాత బకాయిలు ఉన్నా అడ్డు చెబుతున్నాయి. ఈ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 10 శాతం ఎంఎస్‌ఎంఈలకు రుణ పరిమితిని బ్యాంకులు పెంచలేదని పారిశ్రామిక వేత్తలు వాపోతున్నారు.
కరోనా పరిస్థితుల నుంచి ఉపశమనం కల్పించటానికి రాష్ట్ర ప్రభుత్వం 1,100 కోట్ల స్టార్ట్ అప్ ప్యాకేజీని ప్రకటించింది. తక్కువ వడ్డీకే మూలధన రుణాల కోసం 200 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడా ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ఉత్పత్తి పెంచటానికి అవసరమైన పెట్టుబడి కోసం ఎంఎస్‌ఎంఈలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ముందస్తుగా చెల్లిస్తేనే ముడిసరకు సరఫరా అవుతోంది. అరువుపై సరఫరా చేయటం లేదు. పెరిగిన రవాణా ఛార్జీల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
అరకొర సిబ్బందితోనే 30శాతం వరకూ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. పరిశ్రమల్లో ఉండే స్కిల్డ్ ల్యాబర్ స్వస్థలాల నుంచి ఇంకా రాలేదు. వారి కొరత తీర్చాలంటే ఇతర సంస్థల నుంచి ఎక్కువ వేతనాలతో పిలిపించుకోవాల్సి వస్తోంది. రీటైల్ మార్కెట్ పెరగక, వ్యాపారులు సరకు కొనుగోలు చేయట్లేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే పరిశ్రమలు మూసేసుకోవటం తప్ప వేరే గత్యంతరం లేదని పరిశ్రమల వర్గాలు వాపోతున్నాయి.
ఇదీ చదవండి: పదేళ్ల సరిహద్దు వివాదం.. తీరిపోయే సమయం!