బీటెక్ విద్యార్థిని రమ్య హత్యపై డీజీపీకి ఎన్‌సీడబ్ల్యూ లేఖ రాసింది. రమ్య హత్య ఘటనపై నిష్పాక్షిక విచారణ జరపాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శర్మరేఖ లేఖలో పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాల కట్టడికి చర్యలు చేపట్టాలన్నారు. మహిళల భద్రతకు భరోసా కల్పించాలని డీజీపీని ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్ కోరారు.
పట్టపగలే దారుణ హత్య
అంతటా స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న వేళ..ఆగస్టు 15న గుంటూరులో దళిత విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. పట్టపగలే నడిరోడ్డుపై జనం చూస్తుండగానే బీటెక్ విద్యార్థిని రమ్యను (20) శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చాడు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పరమయ్యగుంట సెంటరువద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి అతడి స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమ్య హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, ‘దిశ’ కింద చర్యలు తీసుకొని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.
ఇదీ చదవండి