ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులపై వైకాపా ప్రభుత్వం కన్నేసిందని.. అందుకే వాటి మూసివేతకు పూనుకుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ప్రభుత్వం నియమించిన రత్నకుమారి కమిటీ.. ఎవ్వరితోనూ సంప్రదింపులు జరపకుండానే నివేదిక ఇచ్చిందని విమర్శించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారితల్లిదండ్రులతో కమిటీ చర్చలు జరపలేదన్నారు.
ప్రభుత్వం కోరిన నివేదిక ఇచ్చిందని వస్తున్న ఆరోపణలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు లోకేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ఎయిడెడ్ సంస్థల్ని యథావిధిగా కొనసాగించాలని.., ఏ ఒక్క స్కూలూ మూతపడకుండా చూడాలని లేఖలో కోరారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత, మూర్ఖపు నిర్ణయాలతో ఎయిడెడ్ స్కూళ్లు డెడ్ అవుతున్నాయని మండిపడ్డారు. ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం..లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుకి మరణశాసనంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2,203 ఎయిడెడ్ పాఠశాలల్లో 1,96,313 మంది విద్యార్ధులు, 182 జూనియర్ కాలేజీల్లో 71,035 మంది విద్యార్ధులు, 116 డిగ్రీ కాలేజీల్లో 2.50 లక్షల మంది విద్యార్ధుల భవిష్యతు ప్రశార్ధకం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను డెడ్ చేసి, వాటి పరిధిలోని ఆస్తులు, భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లుందని దుయ్యబట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి లక్షలాది పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలను నిరుపేదలకు దూరం చేయడాన్ని తెలుగుదేశం వ్యతిరేకిస్తోందని లేఖలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
Minister Perni nani: ఒకే రాష్ట్రంగా కలిసుందాం.. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయండి: పేర్ని నాని