Lokesh on filing case against sugarcane farmers at vizianagaram district: విజయనగరం జిల్లాలో బిల్లులు చెల్లించాలని పోరాడుతున్న చెరకు రైతులపై కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం.. ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శనమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పేరుకుపోయిందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి లేఖ రాశారు.
వ్యవసాయ రంగం పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రైతుకు ఉపయోగం లేని ఆర్బీకే సెంటర్ల కారణంగా.. అన్నదాతలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. బకాయి బిల్లులు చెల్లించకపోవడంతో చెరకు రైతులు నష్టాల్లో కూరుకుపోయారని లేఖలో వాపోయారు.
'విజయనగరంలోని ఎన్‌సీఎస్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం.. రెండు వేల మంది రైతులకు రెండు సీజన్ల బకాయి బిల్లులు రూ.17 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. బకాయి చెల్లించకపోవడంతో చక్కెర కర్మాగారం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. అసమర్థ ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. గళమెత్తిన రైతులపై ఉక్కుపాదం మోపుతున్నారు. రైతులకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా..? ఇప్పుడు రైతులను మరింత మానసిక క్షోభకు గురిచేస్తూ.. బొబ్బిలి, సీతానగరం మండలాల్లో 80 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు' అని లోకేశ్ లేఖలో మండిపడ్డారు.
ప్రభత్వం అహంకార ధోరణికి పరాకాష్ట..
Lokesh on filing case against sugarcane farmers: కష్టపడి పండించిన పంటను పరిశ్రమకు తరలిస్తే.. రైతులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా.. బిల్లుల కోసం పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇబ్బందుల్లో ఉన్న చెరకు రైతులను ఆదుకోవడం మాని, ప్రభుత్వమే వారిపై వేధింపులకు దిగడం ప్రభుత్వ అహంకార ధోరణికి పరాకాష్ట అని పేర్కొన్నారు. రైతులకు నోటీసులు పంపి ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి, బకాయిలు వెంటనే చెల్లించాలని లేఖలో డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి..
Chandrababu on OTS: ఓటీఎస్ వసూళ్లు.. పేదల మెడకు ఉరితాళ్లు : చంద్రబాబు