కొవిడ్ నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులు మింగేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. సీఎం జగన్ తనకు ప్రాణాలు విలువ బాగా తెలుసని అసెంబ్లీలో చెప్పటం అతి పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. సొంత బాబాయికే పాపం ఆ విషయం తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రాణాలు విలువ అంతగా తెలిసిన వారైతే మాస్క్ పెట్టుకుని ప్రజలకు ఆదర్శంగా నిలిచేవారన్నారు. ఆరు నెలల్లో ఒక్కసారైనా అసెంబ్లీ నిర్వహించకపోతే ప్రభుత్వ మనుగడకి ప్రమాదం కాబట్టే ఒక్కరోజు నామమాత్రపు అసెంబ్లీ నిర్వహించారని మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు కొవిడ్ రోగుల కోసం 150కి పైగా ల్యాబ్లు ఉంటే ఫలితం వారం రోజులు ఎందుకు పడుతుందో సమాధానం చెప్పాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. కొవిడ్ రోగుల కోసం 47 వేల పడకలు అందుబాటులో ఉంటే ఆస్పత్రి ఆవరణలోనే రోజూ పదుల సంఖ్యలో ఎందుకు చనిపోతున్నారన్నారు. ఆక్సిజన్ కొరత లేకుంటే విజయనగరం, రుయా, అనంతపురం ఆస్పత్రులలో కరోనా రోగులు ఎలా చనిపోయారో చెప్పాలన్నారు. సకాలంలో వ్యాక్సిన్‌కి ఆర్డర్లు పెట్టకుండా చంద్రబాబు పైన ఏడిస్తే ఏం ప్రయోజనమని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కేసులకు భయపడి రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్ కోటాని అడగలేక చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు.
వ్యాక్సిన్ కొనుగోళ్లకు రూ.500 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని లోకేశ్ దుయ్యబట్టారు. నాలుగు బిల్డింగ్ లు కడితే అభివృద్ధి కాదన్న జగన్‌రెడ్డి.. నాలుగు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించటం అభివృద్ధిగా భావిస్తున్నారా? అని నిలదీశారు. కమీషన్ల దెబ్బకు రాష్ట్రంలో ఒక రోడ్డు వేయడానికి టెండర్లకు ఎవ్వరూ రాకుంటే వ్యాక్సిన్ సరఫరా కోసం వేసిన గ్లోబల్ టెండర్లకు ఇంకెవరు వస్తారన్నారు. ఆర్భాటంగా ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లకు నిధుల ప్రస్తావన బడ్జెట్‌లో లేదన్నారు. రాష్ట్రంలో 100 కిలోమీటర్ల రోడ్డు వేశామని కూడా చెప్పుకోలేకపోవటం సిగ్గుచేటని లోకేశ్ విమర్శించారు. రెండేళ్లలో 28 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యమని చెప్పి.. 10 శాతం నిధులే కేటాయించారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: రాష్ట్ర బడ్జెట్ రూ.2,29,779 కోట్లు.. సంక్షేమ పథకాలకు పెద్దపీట