కృష్ణా జిల్లా నందిగామలో కాకాని వెంకటరత్నం(కేవీఆర్) డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తత(Students protest against go no 42)కు దారి తీసింది. కళాశాలను ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలని కోరుతూ.. విద్యార్థులు తరగతులు బహిష్కరించి మూడోరోజుగా ఆందోళన చేపట్టారు. కేవీఆర్ కాలేజీ నుంచి నందిగామలోని గాంధీ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. స్థానిక ఎమ్మెల్యే జగన్మోహనరావు వచ్చి తమ సమస్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఎయిడెడ్ కాలేజీగా మార్చాలని..లేకపోతే ప్రభుత్వ కాలేజీగా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎయిడెడ్ కళాశాలను విలీనం చేస్తూ తీసుకువచ్చిన జీవో నంబర్ 42ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో (KVR College Students protest at national highway in nandigama) చేపట్టారు. సుమారు గంటన్నరపాటు రాస్తారోకో చేయడంతో హైవేపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విద్యార్థులను తోసివేస్తూ.. బలవంతంగా అరెస్టు చేయడంతో ఆందోళన ఉద్ధృతంగా మారింది. కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించగా.. విద్యార్థులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం పోలీసు అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించి తిరిగి కాలేజీ వద్దకు చేరుకున్నారు. జనసేన నాయకులు విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి..