గత ఏడాది మార్చి 23న నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా అదే నెల 15న వాయిదా పడ్డాయి. 12 నగరపాలక సంస్థల్లో డివిజన్లు/వార్డులకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా 6,563 మంది అప్పట్లో నామినేషన్లు వేశారు. 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ దశలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు దశల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది. అవి పూర్తయ్యేలోగా.. వాయిదా వేసిన పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.
తొలి దశ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక తనను కలిసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ వద్ద ఎన్నికల కమిషనర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారని సమాచారం. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఏకగ్రీవాలపై వచ్చిన ఫిర్యాదులు, నోటిఫికేషన్ రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న వినతులపై ఎన్నికల సంఘం న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో సమాచారం సేకరిస్తోంది. ఈలోగా ఎలాంటి వివాదం లేని పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి ఎన్నికల సంఘం వచ్చిందని తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శితోనూ ఎస్‌ఈసీ సమావేశమై ఎన్నికల నిర్వహణకు తేదీలు ఖరారు చేయనున్నారని తెలుస్తోంది.
పురపాలకశాఖ కమిషనర్‌గా ఎంఎం నాయక్
పురపాలకశాఖ కమిషనర్‌గా ఎంఎం నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. కళాశాల విద్య ప్రత్యేక కమిషనర్‌గా ఉన్న నాయక్ తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కళాశాల విద్యాశాఖలోనూ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించాలని సీఎస్ పేర్కొన్నారు. పురపాలకశాఖ కమిషనర్‌గా ఉన్న విజయకుమార్‌ను అటవీశాఖ కార్యదర్శిగా బదిలీ చేశాక పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి కమిషనర్‌గా కూడా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇదీచదవండి.