ఆస్తి మూలధన విలువ ఆధారిత పన్ను విధానంపై ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీలు ఒక వైపున ఆందోళనలు చేస్తుంటే ఇంకో వైపున అమలు కోసం పట్టణ స్థానిక సంస్థల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విలువల ప్రకారం నిర్ణయించిన ఇళ్లు, భవనాల విలువలపై నిర్దేశించిన శాతానికి లోబడి అసెస్‌మెంట్ల (నివాసాలు, నివాసేతరాలు) వారీగా పన్ను విధిస్తూ పురపాలకశాఖ కమిషనరు కార్యాలయం నుంచి వచ్చిన సమాచారాన్ని అధికారులు పునఃపరిశీలించనున్నారు.
ఈ సందర్భంగా గుర్తించే లోపాలను కమిషనరు కార్యాలయానికి మళ్లీ పంపనున్నారు. అంతా సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాక ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు రాగానే కొత్త పన్నుల వివరాలతో ప్రజలకు ప్రత్యేక తాఖీదులు (స్పెషల్ నోటీసులు) జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానం అమలుకు ఇప్పటికే అత్యధిక పట్టణ స్థానిక సంస్థల్లో జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్లపై ప్రజలనుంచి లిఖితపూర్వక అభ్యంతరాలొస్తున్నాయి. వీటిపై పరిశీలన, పరిష్కార ప్రక్రియ మొదలవ్వకముందే అధికారులు కొత్త విధానం అమలుపై దృష్టి పెట్టారు.
ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచే ఏర్పాట్లు..
కొత్త పన్ను విధానంపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచే పురపాలకశాఖ కమిషనరు కార్యాలయం కేంద్రంగా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన అసెస్‌మెంట్ల డేటా సేకరించి స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ విలువల ప్రకారం ఇళ్లు, భవనాల విలువలను మొదట నిర్ణయించారు. వీటిపై పుర, నగరపాలక సంస్థలవారీగా ప్రతిపాదించిన నిర్దేశిత శాతానికి లోబడి నివాస, నివాసేతర భవనాలపై, ఖాళీ స్థలాలపై పన్ను విధించారు.
ఈ డేటాను పుర, నగరపాలక, నగర పంచాయతీలవారీగా మళ్లీ వెనక్కి పంపిన కమిషనరు కార్యాలయం పునఃపరిశీలన ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని అధికారులను తాజాగా ఆదేశించింది. ఉన్న పన్నుపై 15 శాతానికి మించకుండా పెంపు ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాల అమలుపైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి:
Permits Postponed: రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి వాయిదా