‘చైనా యాప్‌లను నిషేధిస్తూ ఆ దేశానికి 82% ముడి ఇనుము ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవడంలో రాష్ట్రానికో వైఖరి అవలంబిస్తున్నారు’ అని తెదేపా లోక్‌సభాపక్ష నేత రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఆర్థిక బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై గణాంకాలతో ఆద్యంతం ఆకట్టుకునేలా ప్రసంగించడంతో పలువురు సభ్యులు బల్లలు చరిచారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో మాజీ ప్రధాని వాజపేయీ బాటలో నడవాలని కేంద్రానికి సూచించారు.
‘విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కలిసి కేంద్రంపై పోరాడారు. 32 మంది ఆత్మ బలిదానాలు చేశారు. 22వేల మంది రైతులు భూములను ఇచ్చారు. అది తెలుగు ప్రజల త్యాగాలపైన నిర్మించిన ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వానికి విశాల హృదయముంటే ఈ విషయాన్ని గుర్తించాలి. ప్రభుత్వం 2వాదనలు వినిపిస్తోంది. అందులో మొదటిది కర్మాగారం ఖాయిలా పడిందని చెబుతున్నారు.. దీంతో విభేదిస్తున్నా. 2000-2015 మధ్య కర్మాగారం రాబడి రూ.1.04 లక్షల కోట్లు. పన్నులు పోనూ ఆదాయం రూ.12,600 కోట్లు. 13 ఏళ్లు నిరంతరంగా 100 శాతం సామర్ధ్యంతో పని చేసింది. 1.03 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేసింది. కొవిడ్ సమయంలోనూ కార్మికులు నిరంతరం పని చేశారు. ఫలితంగా 2020 డిసెంబరులో రూ.212 కోట్లు, జనవరిలో రూ.134 కోట్లు, ఫిబ్రవరిలో రూ.165 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెలలో రూ.300 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా. ఇక రెండో వాదన.... ఖాయిలా పడిన పరిశ్రమతో పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథా అవుతోంది... దీనినీ వ్యతిరేకిస్తున్నాం. కర్మాగారం ప్రారంభం నుంచి కేంద్రం ఈక్విటీగా రూ.4,900 కోట్లు, పునర్మిర్మాణానికి రూ.1,300 కోట్లు మొత్తంగా రూ.6.200 కోట్లు వెచ్చించింది. విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్రానికి పన్నులు, డివిండెట్ల రూపంలో రూ.43వేల కోట్లకుపైగా తిరిగి చెల్లించింది. ఇది కేంద్రం పెట్టిన పెట్టుబడికి 5 రెట్లకంటే ఎక్కువ.
ఇవీ మా డిమాండ్లు...
నేను తెలుగు ప్రజల తరఫున రెండు డిమాండ్లు చేస్తున్నా. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలి. సెయిల్, ఇతర కర్మాగారాలకు సొంత గనులుండటంతో అవి టన్ను రూ.1500కు ముడి సరకు పొందుతున్నాయి. సొంత గనులు లేకపోవడంతో విశాఖ ఉక్కు కర్మాగారం రూ.7వేలు చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతి టన్నుకు రూ.5,260కుపైగా నష్టపోతోంది. రెండోది వడ్డీ రేట్లు తగ్గించాలి. టాటా ఉక్కు కర్మాగారం బ్యాంకుల నుంచి 8% వడ్డీకి రుణాలు పొందుతుంటే... ప్రభుత్వ ఆధీనంలోని విశాఖ ఉక్కు కర్మాగారం 14% రేటుకు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో రూ.1500 కోట్లు వడ్డీల రూపంలో నష్టపోతోంది. మీరు ఎందుకు సెయిల్, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విలీనం చేయరు.
ఏపీపై సవతి తల్లి ప్రేమ
‘మనం ఒకవైపు చైనా యాప్‌లు బ్లాక్ చేస్తున్నాం. మరోవైపు ముడి ఇనుములో 82% చైనాకు ఎగుమతి చేస్తున్నాం. దేశంలోనే చక్కగా పని చేసే ఉక్కు కర్మాగారాలు మీ ఆధీనంలో ఉన్నప్పుడు మీరెందుకు వాటికి సహాయం చేయరు. ఆంధ్రప్రదేశ్‌పై ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు. మార్చి 16న భారీపరిశ్రమల శాఖ మంత్రి ఇదే సభలో... ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థలను పునరుజ్జీవింప జేస్తామన్నారు. అది ఒక్క గుజరాత్‌లోనే ఆచరణలోకి వచ్చింది. గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్‌పీసీ) రూ.8వేల కోట్లు నష్టాల్లో ఉన్న ఖాయిలా పరిశ్రమ. ఓన్జీజీసీ రూ.13వేల కోట్లతో అందులో 80% వాటాలను కొనుగోలు చేసింది. గుజరాత్‌లోని సంస్థలపై చూపిన ప్రేమను విశాఖ ఉక్కుపై ఎందుకు చూపరు...? కేంద్రం నామాట ఆలకించకుంటే... మాజీ ప్రధాని వాజపేయీ గురించి చెబుతా. వాజపేయీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా ఎర్రన్నాయుడు ఉన్నారు. వారు ఓ ప్రతినిధి బృందాన్ని వాజపేయీ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయన ప్రజల మనోభావాలను గౌరవించారు. వైజాగ్ ఉక్కు కర్మాగారం రుణ విముక్తికి ఈక్విటీ కల్పించారు. వాజపేయీ మార్గంలో ప్రస్తుత ప్రధానమంత్రి నడిచి విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలి. తక్కువ రేటుకు రుణాలు ఇప్పించి విశాఖ ఉక్కు కర్మాగారానికి సహాయపడాలి’ అని రామ్మోహన్ నాయుడు కోరారు.
ఆంధ్రప్రదేశ్ దేశంలో భాగమే: కనకమేడల
‘ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో ఒక భాగమే. సంఘటిత నిధుల నుంచి కొంత మొత్తం ఆంధ్రప్రదేశ్‌కూ కేటాయించాలని నేను ఆర్థిక మంత్రికి విన్నవిస్తున్నా’ అని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. రాజ్యసభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ..‘2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాయి. ఏపీ రెవెన్యూ లోటుతో ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మాకు 25 లోక్‌సభ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని ప్రకటించింది. ప్రజలు 22 సీట్లు ఇచ్చినా నాయకులు అన్నీ మర్చిపోయారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్రం ఇతర పథకాలకు మళ్లిస్తోంది. వీటిపై దృష్టిపెట్టాలి’ అని ఆయన కోరారు.
ఇదీచదవండి