MP Kanakamedala On Annamayya Project: అన్నమ్మయ్య ప్రాజెక్టు అంశాన్ని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో ప్రస్తావించారు. భారీ వరదల వల్ల కొట్టుకుపోయిన ప్రాజెక్టు గేట్ల అంశాన్ని ఎగువ సభలో లేవనెత్తారు. నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నిర్వహణ లోపంతోనే పెద్ద నష్టం చోటు చేసుకుంది. నష్టానికి బాధ్యులు ఎవరన్నది కేంద్రమే తేల్చాలి. కేంద్రం స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి. ప్రాజెక్టు గేట్లు సకాలంలో తెరుచుకోకనే నష్టం సంభవించింది. ప్రజల ప్రాణాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. -కనకమేడల రవీంద్ర కుమార్, తెదేపా ఎంపీ
ఊహకందని విపత్తు..
కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నవంబరు 16, 17, 18 తేదీల్లో కుండపోత వర్షాలు కురిశాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడ్డాయి. భారీ వరద ముంచెత్తడం, ప్రకృతి విపత్తు వల్ల అన్నమయ్య, ఫించ జలాశయాల కట్టలు తెగిపోయాయి. ఈ ప్రమాదంలో పలు గ్రామాలకు చెందినవారు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం సంభవించి.. బాధిత గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఘటనపై పెను దుమారం..
అన్నమయ్య, పింఛ జలాశయాల వరద కట్టలు తెగిపోయి పెను విధ్వంసం జరిగిన ఘటనపై ఇంటా బయటా పెనుదుమారం రేగింది. ఈ విషయంలో యంత్రాంగం వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోగా.. ప్రాణనష్టమూ సంభవించింది. కేవలం రెండు, మూడు గంటల్లోనే వచ్చిన అనూహ్య వరద.. ప్రకృతి విపత్తు వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నది అధికారవర్గాల వాదన.
కానీ, జలవనరుల రంగంలో ఉన్న నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సామర్థ్యానికి మించిన వరదతోనే డ్యాంలు తెగిపోవని, నిర్వహణ వైఫల్యాలు కూడా తోడవడమే ఈ పెను ప్రమాదానికి కారణమని అంటున్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వరదల సమయంలో చూపించాల్సిన అప్రమత్తత విషయంలో అలక్ష్యం కూడా ప్రధాన కారణమని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదీ చదవండి