విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఈనెల 13వ తేదీన భారీ వర్షాలకు ఘాట్‌రోడ్డుపై ఓం మలుపు వద్ద కొండచరియలు విరిగిపడడంతో దేవస్థానం యంత్రాంగం వెంటనే కొండపై నుంచి పడిన బండరాళ్ల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. టోల్‌గేట్ నుంచి అమ్మవారి ఆలయం వరకు ఎలాంటి వాహనాలు ఘాట్‌రోడ్డుమీదుగా రాకుండా నిలిపివేసింది. ప్రస్తుతం లిఫ్ట్ సౌకర్యం లేదు. పూర్తిగా వినాయక ఆలయం నుంచి అమ్మవారి సన్నిధి వరకు భక్తులంతా కాలినడకనే దర్శనానికి వచ్చి వెళ్తున్నారు. ఘాట్‌రోడ్డుపై నుంచే క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
దసరా నవరాత్రుల ప్రారంభం రోజున కురిసిన వానకు చిన్నపాటి రాళ్లు కొండపై నుంచి దిగువకు దొర్లిపడ్డాయి. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కొండపై బీటలు పెరిగాయి. చరియలు పెద్ద పరిమాణంలోనే విరిగిపడుతున్నాయి. ప్రస్తుతానికి ఐరెన్ మెష్ వేసి తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారే తప్ప శాశ్వత ప్రాదిపదికన పనులు జరగడంలేదు. కొండ చరియలు విరిగిపడటంపై మీడియా పలుమార్లు దేవస్థానం దృష్టికొచ్చినా... హెచ్చరిక బోర్డులు పెట్టి వదిలేస్తున్నారు.
కొండచరియలు విరిగిపడిన అంశంపై ఈనెల 17వ తేదీన దసరా నవరాత్రుల ప్రారంభం రోజు సాయంత్రం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ పైలా సోమినాయుడు ఈటీవీభారత్తో మాట్లాడారు. దసరా ఉత్సవాల తర్వాత శాశ్వత చర్యలు తీసుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు.
ఇదీ చదవండి: