Kollapur Politics: తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలోని తెరాస నేతలు జూపల్లి కృష్ణారావు- ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మధ్య తారాస్థాయికి చేరిన అధిపత్యపోరుకు ఫలితమే ఈ ఉద్రిక్తత. కొన్నేళ్లుగా ఎడమొహం -పెడమొహంగా ఉన్న ఇద్దరు నేతలు... ఇటీవల ఒకరిపై ఒకరు బహిరంగంగానే పరస్పర, వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. కొల్లాపూర్ అభివృద్ధి సహా పరస్పరం చేసుకున్న ఆరోపణలపైనా బహిరంగ చర్చకు సిద్ధమంటూ నేతలు సవాళ్లు విసురుకున్నారు. కొల్లాపూర్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో ఇవాళ బహిరంగ చర్చకు రావాలంటూ జూపల్లి కృష్ణారావు సవాలు చేయగా.. జూపల్లి ఇంటికే వెళ్తానంటూ బీరం బదులిచ్చారు. ఇరువర్గాల నుంచి బహిరంగచర్చకు అనుమతివ్వాలంటూ దరఖాస్తులు వెళ్లగా పోలీసులు రెండింటిని తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొల్లాపూర్‌లో ఇవాళ జనం గుమిగూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. జూపల్లి, బీరం సవాళ్ల దృష్ట్యా కొల్లాపూర్‌లో పోలీసుల మోహరించారు.
ఇద్దరు నేతలకు మద్దతుగా పెద్దఎత్తున కార్యకర్తలు, శ్రేణులు కొల్లాపూర్‌కు తరలివచ్చారు. మరోవైపు జూపల్లితో చర్చకు కొల్లాపూర్‌కు పెద్దఎత్తున అనుచరులతో బయల్దేరిన బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పెంట్లవెల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు సమయంలో కార్యకర్తల నినాదాలతో పరిసరాలు హోరెత్తాయి. జూపల్లి ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు ఎమ్మెల్యే వర్గం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, తెరాస కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
మరోవైపు జూపల్లి కృష్ణారావు ఇంటి వద్ద పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలిరాగా... పోలీసులు వారిని నిలువరించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చి జూపల్లి.. తనపై ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. నన్ను ఎదుర్కొలేనని తెలిసే బీరం హర్షవర్ధన్ డ్రామాలు చేస్తున్నారన్నారు. బ్యాంకురుణాలు ఎగ్గొట్టాడని తనపై తప్పుడు ఆరోపణలు చేశాడన్న ఆయన... బ్యాంకు రుణాలు చెల్లించినట్లు రుజువులు చూపించారు.
"రిజర్వాయర్ ముంపు బాధితులకు సరైన పరిహారం అందలేదు. ముంపు బాధితులకు పునరావాసం కూడా ఇప్పటికీ దక్కలేదు. వర్షం పడితే ఊరు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ముంపు బాధితులది. సమస్య పరిష్కరించకుండా ఎమ్మెల్యే నాపై నిందారోపణలు చేశారు. నేను సంపాదించిన పేరు, ప్రతిష్ఠలను మసకబార్చే ప్రయత్నం చేశారు. మంచి చేసి పేరు సంపాదించాలి.. చౌకబారు రాజకీయాలెందుకు?. ఆరోపణలపై చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యేకు సవాల్ చేశా. అంబేడ్కర్ చౌరస్తా వద్ద చర్చకు రమ్మని 15 రోజులు సమయమిచ్చా. అంబేడ్కర్ చౌరస్తాలో సంతకు ఇబ్బంది అవుతుందన్నారు. మీ ఇంటికే వస్తా.. ఆరోపణలపై అక్కడే చర్చిద్దామన్నారు. ఉదయం నుంచి ఎదురుచూస్తున్నా.. నా వద్దకు వచ్చేందుకు ధైర్యం చాలక అరెస్టు చేయించుకున్నారు. తన వర్గీయులకు మాత్రమే ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి మేలు చేశారు. బ్యాంక్‌కు డబ్బు ఎగ్గొట్టానని ఎమ్మెల్యే ఆరోపించారు. 1996లో బ్యాంక్ నుంచి రూ.1.30 కోట్లు రుణం తీసుకున్నా. వడ్డీతో సహా చెల్లిస్తే బ్యాంక్ నాకు ఒక ధ్రువపత్రం ఇచ్చింది. ఫ్రుడెన్షియల్ బ్యాంక్‌లో రూ.6 కోట్లు రుణం తీసుకున్నా. వడ్డీతో సహా మొత్తం రూ.14 కోట్లు చెల్లించి సెటిల్ చేశా. మా ఇద్దరి మధ్య ఉన్న తగాదాతో తెరాసకు సంబంధం లేదు." - జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి
ఇరునేతల బహిరంగ చర్చ దృష్ట్యా... శనివారం సాయంత్రం నుంచే కొల్లాపూర్‌లో అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతులు లేని సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక, మాజీ మంత్రి జూపల్లిని పోలీసులు గృహనిర్బంధం చేయగా... ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ను అరెస్టు చేశారు. కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా భద్రత ఏర్పాటుచేశారు.
ఇవీ చూడండి: