విజయవాడ వన్ టౌన్‌లోని 54వ డివిజన్ పంజా సెంటర్ లో.. వైకాపా కార్యలయాన్ని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. రూ. 500 కోట్లతో విజయవాడ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 45 వేల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు.
తెదేపా అధినేత చంద్రబాబు హయాంలో ఒక్క పైసా అయినా.. నగరాభివృద్ధికి ఖర్చు చేయలేదని వెల్లంపల్లి విమర్శించారు. చంద్రబాబు భాజపాతో కలిసున్నప్పుడు జై శ్రీరామ్ అని.. విడిపోయిన తర్వాత మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అలాగే రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. సినిమా గ్లామర్‌తో భాజపాలో చేరారన్నారు.
అన్ని మతాలను గౌరవిస్తూ.. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా.. ముందుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబుకు బినామీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైకాపాకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ ఎన్ని కుట్రలు చేసినా ఫ్యాను గాలి రాష్ట్రమంతా వీస్తుందని అన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎలాంటి ఎన్నికలు జరిగినా.. తమ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: