గత ఏడాదిలో జరిగిన ఉపాధి హామీ పనుల్లోని అవకతవకలపై ప్రభుత్వం... విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. విజిలెన్సు విచారణలో నిరూపణ అయిన పనులకు బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు ఎక్కడా బిల్లుల చెల్లింపులు జాప్యం చేయటం లేదని ఆయన తెలిపారు. సచివాలయంలో గ్రామీణ ఉపాధి హామీ పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాదిలోగా వెయ్యి కోట్ల వరకూ ఉపాధి హామీ కోసం నిధులను ఖర్చు చేయాల్సిందిగా మంత్రి లక్ష్యం విధించారు. నాడు-నేడు కింద 284 మండలాలను ఎంపిక చేసి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే పనులు చేపట్టాలని సూచించారు. 5, 853 పాఠశాల భవనాలకు నరేగా కింద పనులు చేపడతామని అన్నారు. గత రెండు నెలల్లో ఉపాధి హామీ పనులకు 1400 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకూ మొత్తం మెటీరియల్ వ్యయం 871.18 కోట్ల రూపాయలు అయ్యిందని తెలిపారు.
ఇవీ చదవండి...3 రాజధానులు కావాలని ఎవరడిగారు?: చంద్రబాబు