రైతుభరోసా కేంద్రాల ద్వారా నేరుగా ఇంటికే యూరియా పంపుతున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. రైతుభరోసా కేంద్రాల నిర్మాణంపై మంత్రి కన్నబాబు జేసీలు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. స్థానికంగానే విత్తనాలు ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతుభరోసా కేంద్రాలు త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించామన్న మంత్రి.. నిర్మాణాలు పూర్తి చేసి రైతులకు వ్యవసాయ, అనుబంధ సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలవారీగా ఎరువులు, విత్తనాలు అందుతున్న తీరుపై కన్నబాబు ఆరా తీశారు. నెల్లూరు జిల్లాలో సాగు ఉత్పత్తుల కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. రైతు సమస్యల పరిష్కారంలో సానుకూలంగా స్పందించాలని.. ఈ-క్రాప్ బుకింగ్, రైతుభరోసా కేంద్రాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇతర మౌలిక వసతులపై జేసీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి కన్నబాబు.
పథకం అమలు చేసే విధానంలోనే మార్పు
విద్యుత్ నగదు బదిలీ పథకం అమలు చేసినప్పటికీ రైతుల ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని మంత్రి కె.కన్నబాబు స్పష్టం చేశారు. మెరుగైన విధానాన్ని రైతులకు అందించేందుకే పథకంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పగటిపూట ఉచిత విద్యుత్ అందించడం సాధ్యం కాదని చంద్రబాబు అంటే.. జగన్ చేసి చూపించారని మంత్రి వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతకుముందు కాలేజీలకు ఇచ్చేవారమని.. ఇప్పుడు నేరుగా లబ్ధిదారులకే అందిస్తున్నామని.. ఇప్పుడు వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ పథకంలోనూ అలాంటి మార్పే జరిగిందని మంత్రి వ్యాఖ్యానించారు. రైతు ఖాతాల్లో డబ్బులేస్తే.. ఆ డబ్బులను రైతులు డిస్కంలకు చెల్లిస్తారని అన్నారు. అమలు చేసే విధానంలో మార్పు తప్ప పథకంలో మార్పు లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కేంద్రం కసరత్తు!