BOTSA: రాష్ట్ర ప్రజలు పడుతోన్న కష్టాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైకాపా ప్రభుత్వ తీరుతో మాత్రం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉంటే దాన్ని మీడియా నిరూపించాలని సవాల్ చేశారు. ఎస్సీల సంక్షేమం కోసం భాజపా ఏంచేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలు సంతోషంగా ఉండటం భాజపాకు ఏమాత్రం ఇష్టం లేదన్న ఆయన....చల్లగా ఉన్న చోట అగ్గి రాజేయడమే ఆ పార్టీ విధానమని.....మండిపడ్డారు. అప్పులపై చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అప్పులు చేయకుండ.. ఆయన ఆస్తులు అమ్మి డబ్బు తెచ్చారా.. అని ప్రశ్నించారు. గడప గడపలో మమ్మల్ని ఎవరూ అడ్డుకోవడం లేదన్నారు. శ్రీలంకకు పటిష్ట నాయకత్వం లేకపోవడం వల్ల అలాంటి పరిస్థితి వచ్చిందని, ఏపీలో పటిష్ట నాయకత్వం ఉందని బొత్స వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదన్న బొత్స....అలాంటిదేమన్నా ఉంటే పార్టీ పరంగా నిర్ణయం తీసుకుని చెబుతామన్నారు.
ఇవీ చదవండి: 'మ..మ.. మహేశా'.. లైఫ్ అంటే నీదేనయ్యా- లగ్జరీ కార్లు.. ప్రైవేట్ జెట్.. మామూలుగా లేదుగా!