విజయవాడలో రైతు శిక్షణా కేంద్రంలో కృష్ణా జిల్లా నీటిపారుదల సలహా మండలి 32వ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రులతో పాటు ఇంఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసనసభ్యులు హాజరయ్యారు. రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి రామచంద్రారెడ్డి తెలిపారు. గతేడాది ఎప్పుడూ లేని విధంగా 179 టీఎంసీల నీటిని రెండు పంటలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదేనని అన్నారు. పశ్చిమ కృష్ణా, తూర్పు డెల్టాలో నీటి సమస్యలపై జిల్లా శాసనసభ్యులు అధికారులను ప్రశ్నించారు.
విభేదాలు పరిష్కరించండి
కృష్ణా జిల్లా తూర్పు డెల్టాలో 7.37 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. సాగర్ ఆయకట్టు జోన్ 3 లో 3.67 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగర్ నుంచి పశ్చిమ కృష్ణా ఆయకట్టుకు నీరు అందడంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని నూజివీడు, మైలవరం, జగ్గయ్య పేట, నందిగామ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. నీటి పంపిణీలో రైతుల మధ్య విభేదాలు రాకుండా చర్యలు తీసుకుని... నీటి సరఫరా సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. మురుగు నీటి కాల్వల వ్యవస్థ సరిగా లేదని తెలిపారు.
తెలంగాణతో ఓ అంగీకారానికి రావాలి
సాగర్ కాల్వకు 9 రోజులు ఆన్ పీరియడ్, 6 రోజులు ఆఫ్ పీరియడ్ కింద నీటిని అందిస్తున్నారని.... ఈ విధానాన్ని మెరుగుపరచాలని కోరారు. బుడమేరు కాలువ ఆధునీకరణ చేయడంపై దృష్టి పెట్టాలని మైలవరం శాసనసభ్యుడు కోరారు. నందిగామ నియోజకవర్గంలో జోన్ 3 లో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పరిటాల గ్రామానికి కనీసం తాగు నీరు ఇవ్వడంలో సాగర్ అధికారులు చేతులు ఎత్తేశారు అని నందిగామ శాసన సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. వేంపాడు మేజర్ ఆయకట్టుకి 2 ఏళ్లుగా నీరందక రైతులు నష్టపోతున్నారని, చింతలపూడి కాల్వ పనులు త్వరగా పూర్తి చేస్తే తప్ప రైతుల నీటి సమస్యలు తీరవని నూజివీడు శాసన సభ్యుడు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణతో ఉన్న సమస్యలపై పరిష్కారం దిశగా ఓ నిర్ణయానికి రావాలని, నీటి వివాదాలు రాకుండా చూడాలని పశ్చిమ కృష్ణా శాసనసభ్యుడు అభిప్రాయపడ్డారు.
ధాన్య భాండాగారంగా పేరొందిన కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంద. ఒక్క కృష్ణా జిల్లాలో 7.37 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. గతేడాది 179.8 టీఎంసీల నీటిని సాగుకు విడుదలచేశారు. పట్టిసీమ నుంచి 26.69 టీఎంసీలు, మున్నేరు నుంచి 59.48 టీఎంసీలు, సాగర్ నుంచి 94.62 టీఎంసీల నీరుతో ఆయకట్టులో ఖరీఫ్, రబీ పంటల సాగు జరిగిందని అధికారులు తెలిపారు.
ప్రజా ధనం వృథా అవుతోంది
తూర్పు కృష్ణా శివారు ఆయకట్టు నియోజకవర్గాల శాసనసభ్యులు పలు సాగునీటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా అవనిగడ్డ, పామర్రు, పెదన, గుడివాడ, కైకలూరు శాసనసభ్యులు పంట కాల్వల మరమ్మతులపై, మురుగు కాల్వల నిర్వహణ లోపాలను మంత్రులకు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యాక మురుగు, పంట కాల్వల మరమ్మతులు ప్రారంభించడం వల్ల పనుల్లో నాణ్యత లోపించి, ప్రజాధనం వృధా అవుతోందని శాసన సభ్యులు అభిప్రాయపడ్డారు.
త్వరలోనే పరిష్కరిస్తాం...
సమస్యలను తొందరలోనే పరిష్కరిస్తామని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కోసం మంత్రులు, జిల్లా శాసన సభ్యులు ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా ఇంఛార్జీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్రి, జిల్లా శాసన సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఏలూరు కాల్వ, రైవస్ కాల్వలకు మాత్రమే నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బందరు కాల్వ, కేఈబీ కెనాల్‌కు మరమ్మత్తులు జరుగుతున్న నేపథ్యంలో నెలాఖరులో నీరు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. పట్టిసీమ నుంచి 13 మోటార్లు ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీ మళ్లీస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: