తమ ప్రభుత్వం వచ్చాకే పోలవరం స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పూర్తిచేశామని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మంత్రిగా సాంకేతిక అంశాలు తెలియాల్సిన అవసరం లేదని చెప్పారు. సాంకేతిక అంశాలు తెలియకపోయినా తనకు కామన్ సెన్స్ ఉందని అంబటి వ్యాఖ్యానించారు. దేశంలో ఆరోగ్యశాఖల మంత్రులు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ఎత్తుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు. ముంపు ప్రాంతాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపారని.. ఈ విషయాన్ని తెలంగాణ నేతలు గుర్తించాలని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్రం చెప్పిందన్నారు. అయితే దీనిలో తెదేపా ఐదేళ్లు, వైకాపా మూడేళ్లు అధికారంలో ఉన్నాయన్నారు. ఎక్కువ సమయం ఎవరు అధికారంలో ఉన్నారని మంత్రి ప్రశ్నించారు. కొత్త డీపీఆర్ ఆమోదం అంశం కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రూ.2,700 కోట్లు ఏపీకి రావాల్సి ఉందన్నారు.
చంద్రబాబు వల్లే ఆలస్యం: పోలవరం ఆలస్యం కావడానికి జగన్ ప్రభుత్వమే కారణమనే ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంబటి ఆరోపించారు. కేవలం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు వల్లే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని చెప్పారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం కాకుండా డయాఫ్రామ్ వాల్ నిర్మించటం వల్ల అది వరదల్లో కొట్టుకుపోయిందన్నారు. వరద వచ్చిన 10 రోజులకు ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధితుల పరామర్శకు వెళ్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని భాగాలు కొట్టుకుపోయాయని.., 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా పోలవరం ప్రాజెక్టు దగ్గరే ఉండి కాపాడుకున్నామన్నారు. గోదావరికి భారీగా వరదలు వచ్చినా ప్రాణనష్టం జరగకుండా చూశామని అన్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.2 వేల చొప్పున చెల్లించామని చెప్పారు. 2018 లోనే ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమా ఐదేళ్లలో ఏం చేశారని అంబటి ప్రశ్నించారు.
ఇవీ చూడండి