తిరుపతి వేంకటేశ్వరుడి నిత్య పూజల్లో పునుగు పిల్లి నుంచి వచ్చే తైలాన్ని వినియోగిస్తున్నందున ఆ జంతువును పవిత్రంగా చూస్తారు. ఆ జంతువును వేటాడి చంపి తిన్న ఇద్దరిని తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు వద్ద అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.
చింతపల్లి మండలం వింజమూరులో ఈనెల 13న అరుదైన పునుగుపిల్లిని గుర్తు తెలియని వేటగాళ్లు ఉచ్చులు వేసి పట్టుకుని ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తున్న చిత్రాలను కొందరు గ్రామస్థులు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. దీన్ని ఆధారంగా చేసుకుని అటవీశాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోను విశ్లేషించగా కీలకమైన ఆధారాలు లభ్యమైనట్లు మునుగోడు ఫారెస్టు రేంజ్ అధికారి రమేష్ వెల్లడించారు.
ఈనెల 18న మాల్ పరిధిలోని గొడుకొండ్లలో ఓర్సు వెంకన్న, ఓర్సు యాదగిరి ఇందులో నిందితులుగా తేల్చి అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా పునుగుపిల్లిని చంపి కోసుకొని తిన్నట్లు నిందితులు ఒప్పుకున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి ద్విచక్రవాహనం, ఉచ్చులు, పిల్లి కళేబరం స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. నిందితులిద్దరిని దేవరకొండకు కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ చేసినట్లు రమేష్ తెలిపారు.
ఇవీ చూడండి: మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు