తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంగా ఏరో స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. కర్వెన, ఉదండాపూర్ జలాశయాల మధ్య సుమారు 15 ఎకరాల స్థలంలో శిక్షణ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
రూ. వెయ్యి కోట్లతో...
మహబూబ్‌నగర్ స్టేడియంలో జాతీయ పారామోటార్ ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా హైదరాబాద్‌కు దీటుగా దినదినాభివృద్ధి చెందుతోందని, త్వరలో రూ. 1,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. మహబూబ్‌నగర్ పెద్ద చెరువు ట్యాంక్‌బండ్‌కు సమీపంలో శిల్పారామం పనులు ప్రారంభిస్తామని, సుమారు రూ. 10 కోట్లతో హీట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తామన్నారు.
అంతర్జాతీయ క్రీడలకు శిక్షణ...
ఐటీ పార్క్ వీలైనంత త్వరగా పాలమూరు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్క్ మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉందని గుర్తు చేసిన ఆయన... పారామోటార్ శిక్షణ కేంద్రం ఏర్పాటుతో అంతర్జాతీయ క్రీడలకు శిక్షణ కేంద్రంగా మారనుందని చెప్పుకొచ్చారు. ఐదు రోజుల పాటు జరిగే పోటీలతో పాటు ప్రజల కోసం జాయ్ రైడ్స్ సైతం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
నామమాత్రం రుసుముతో...
నామమాత్రపు రుసుముతో పారామోటార్, హాట్ ఎయిర్ బెలూన్లలో పాలమూరు పట్టణ వాసులు ఆకాశంలో విహారం చేయొచ్చన్నారు. ఈ సందర్భంగా పారామోటార్లతో క్రీడాకారులు విన్యాసాలు చేశారు. సుమారు 3 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ విన్యాసం ఎయిర్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 10 రాష్ట్రాల నుంచి 11 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: చిన్నారి వైద్యానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య సాయం