Lokesh: రాజకీయ అవసరాల కోసం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ.. యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్, కేంద్ర ఉన్నత విద్య శాఖ కార్యదర్శి సంజయ్ మూర్తి కి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖల రాశారు.
విశ్వవిద్యాలయాల్లో ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలకు ప్రైవేటు జాబులు ప్రకటించటం రాజ్యాంగ వ్యతిరేకమని లోకేష్ విమర్శించారు. విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లోనే జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఏప్రిల్ 1న విశాఖ ఏయూ, తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, గుంటూరు జిల్లాలోని ఏఎన్‌యూ లలో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా గెలుపు కోసం కృషి చేసిన వారికే ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు విజయసాయి వ్యాఖ్యానించారని లోకేష్ ధ్వజమెత్తారు. ఇందుకనుగుణంగా ysrcpjobmela.com పేరిట ఓ వైబ్సైట్ కూడా అందుబాటులోకి తెచ్చారని వివరించారు. రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తూ జరిగిన ఈ ఘటనల పట్ల తగు చర్యలు తీసుకోవాలని యూజీసి ఛైర్మన్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంస్థలను వైకాపా కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాదిమంది నిరుద్యోగ పట్టభద్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉద్యోగ అవకాశాలను వైకాపా కార్యకర్తలకే పరిమితం చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 35శాతం ఉందని.. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత అధ్వాన్నంగానూ.. భారతదేశంలో 4వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సొంత క్యాడర్ కోసం వైకాపా జాబ్ మేళా నిర్వహించటం విస్మయం కలిగిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రోద్భలంతోనే ఈ ఘటనలు చోటుచేసుకోవటం బాధాకరమన్నారు. విద్యా సంస్థలను పార్టీ రాజకీయాల్లోకి నెట్టేస్తున్న ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు.
![lokesh letter to ugc chairman jagadeesh kumar and Central Higher Education Secretary Sanjay Murthy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14969957_lok.jpg)
సమస్యను తక్షణమే పరిష్కరించకుంటే.. ఏపీ తరహాలోనే ఇతర రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ప్రభుత్వ విద్యా సంస్థలలో రాజకీయ కార్యకలాపాలకు నాంది పలికే ప్రమాదం ఉందన్నారు. విద్యా సంస్థల నైతికత, విలువలు దిగజారకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. వైకాపా జాబ్ మేళాకు సంబంధించిన మీడియా కథనాలను లేఖకు జతచేస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Kanakamedala Ravindra kumar: జగన్ సీఎంగా ఉండడమే దౌర్భాగ్యం: కనకమేడల