రాష్ట్రంలో 97వేల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. దాదాపు 12లక్షల మంది కార్మికులు ఈ రంగంపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆధారపడి ఉన్నారు. లాక్‌డౌన్ ప్రభావం కారణంగా దాదాపు 2నెలల పాటు ఈ పరిశ్రమలన్నీ మూతపడటంతో తయారీరంగంపై తీవ్ర ప్రభావం పడింది. నష్టం అంచనాను ఇప్పుడే వేయటం కష్టతరమైనా వేలాది కోట్లల్లో ఈ తీవ్రత ఉంటుందని పారిశ్రామికవేత్తలు కలవరపడుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర ఉద్దీపనులు ప్రకటించినా అవి ఏమాత్రం చాలవనే అభిప్రాయం చిన్న పరిశ్రమల యజమానుల్లో వ్యక్తమవుతోంది.
యూనిట్లలో ఉత్పత్తి లేకున్నా వేతనాల చెల్లింపులు ఎంఎస్ఎంఈలకు తలకు మించిన భారమైంది. వీటిలో ప్రధానంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, బియ్యం, పప్పు, నూనె మిల్లులు, ప్లాస్టిక్, ఫ్యాబ్రికేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, జిన్నింగ్, స్పిన్నింగ్, ఇతర ఆహార అనుబంధ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలున్నాయి. లాక్‌డౌన్ అనంతరం సడలింపు వచ్చినా...., పనిచేసే వారు లేకపోవటం, ప్రజా రవాణా నిలిచిపోవటం, రెడ్ జోన్ పరిధి వంటి అంశాల కారణంగా ఉత్పత్తి పునరుద్ధరణ కష్టతరంగా మారింది.రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు మూతపడటంతో లక్షకోట్ల వరకూ ఉత్పత్తులు నిలిచిపోయాయి.
కరోనా కాటుకు ముందే గత 7-8నెలలుగా ఆర్థికమాంద్యం ఇబ్బందులతో సతమతమవుతున్న పారిశ్రామిక రంగం తాజా పరిస్థితులతో పూర్తిగా కుదేలయ్యే ప్రమాదంలో పడింది. ప్రభుత్వం నుంచి పరిశ్రమలకు రావాల్సిన దాదాపు 4వేల కోట్ల ప్రోత్సహకాలు విడుదల కాకుండా పెండింగ్లో ఉండటం..., పలు పరిశ్రమలు ఓవర్ డ్రాఫ్ట్ ఇతరత్రా ఇబ్బందుల్లోకి వెళ్లటం వంటి పరిణామాలకు కరోనా కష్టాలు తోడయ్యాయి. ప్రభుత్వాలు 10శాతం అప్పు తీసుకునే వెసులుబాటు, రవాణా నిబంధనల సడలింపు వంటివి పెద్ద ప్రభావం చూపవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వడ్డీ రాయితీ పై దృష్టి సారించటంతో పాటు కనీసం పరిశ్రమలను ఆదుకునేందుకు 6నెలల వరకూ వివిధ అంశాలకు వెసులుబాటు కల్పిస్తేనే ప్రయోజనకరమని వెల్లడిస్తున్నారు.
లాక్‌డౌన్ ఎత్తివేసినా ఈ యూనిట్‌లు ఇప్పటికిప్పుడు పని ప్రారంభించలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాగా..అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పరిశ్రమలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మాస్క్‌లు, శానిటైజర్లను అందజేయడం, కార్మికులకు ఆహారం ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇది తమకు అదనపు భారమేనని ఎంఎస్ఎంఈ యజమానులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2016లో చివర్లో చేసిన నోట్ల రద్దు, 2017లో తెచ్చిన కొత్త పరోక్ష పన్నుల చట్టం జీఎస్టీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలైన ఎంఎస్ఎంఈలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
భవిష్యత్తును తలచుకొని చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న పరిశ్రమలకే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత మళ్లీ సాధారణ స్థితికి రావడానికి అయిదారు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
పరిశ్రమల్లో పనిచేసే వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. వీరికి స్థానిక రేషన్ కార్డులు లేకపోవటంతో ప్రభుత్వం అందించే నిత్యవసరాలను అందుకోలేకపోతున్నారు.తమనే నమ్ముకుని ఉన్న కార్మికులను పొమ్మన లేక, పరిశ్రమ నడపకుండా పోషించలేక..మనో వేదనకు గురి కావలసి వస్తోందని పరిశ్రమల నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు.