చరిత్ర పునరావృతమైంది. ఎప్పటిలాగే హైదరాబాద్ మహానగర ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు, మీడియా కలిసి ఓటర్లకు ఎంత అవగాహన కల్పించినా... మళ్లీ అదే నిర్లక్ష్యం కనిపించింది. బల్దియా పోలింగ్ గురించి సెలవిచ్చినా... చాలామంది ఓటు వేసేందుకు బయటకు రాకపోవడం గమనార్హం. కరోనా వ్యాప్తితో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు, ప్రముఖ ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే సౌలభ్యం కల్పించినా ఓటు వేయకపోవడం బాధ్యతారాహిత్యమే అని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ ప్రాంతాల్లోనే తక్కువగా....
గ్రేటర్‌లో ఇంత తక్కువ పోలింగ్ నమోదుకు శని, ఆదివారాలకు తోడు సోమవారం గురునానక్ జయంతి.. మంగళవారం పోలింగ్‌కు సెలవివ్వడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఊరి బాట పట్టారు. కరోనా భయంతో మరికొందరు ఓటు వేయడానికి ఇష్టపడలేదు. పోలింగ్‌పై అవగాహన కల్పించడంలోనూ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. ఓటుపై ప్రజలను చైతన్యపర్చచడంలోనూ రాజకీయపక్షాలు వెనకబడ్డాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు బోసి పోయి కనిపించాయి. చాలా చోట్ల బూత్ ఏజెంట్లు, పోలీసులే దర్శనమివ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బస్తీలు, నగర శివార్లలో పోలింగ్ కాస్త మెరుగ్గా ఉన్నా... టెకీలు, వైట్ కాలర్ జాబులు చేసే వారు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ మందకోడిగా సాగింది.
సెలవులే కారణమా?
ఇక ఏ ఎన్నికలయినా సరే పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ అధికంగా ఉంటోంది. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు పోలింగ్ నాటికి స్వగ్రామాలకు వచ్చి తప్పక ఓటు వేస్తారు. స్థానిక నాయకులు సైతం ప్రత్యేక శ్రద్ధతో ఓటర్లను స్వస్థలాలకు రప్పిస్తారు. విద్యాధికులైన నగరవాసులు మాత్రం రాజ్యాంగ హక్కును వినియోగించుకోవడంలో నిర్లిప్తత ప్రదర్శించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌కు మొహం చాటేసిన వారి ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటివి రద్దు చేయాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓటింగ్‌కు ముందు ఇలా వరుస సెలవులు రాకుండా చూసుకోవాలని కోరుతున్నారు.
ఆదర్శం
మరోవైపు కొందరు మాత్రం అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య వచ్చి ఓటుహక్కు వేసి వినియోగించుకుని స్ఫూర్తిని చాటారు. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ శంకరయ్య కుమారుడు రిత్విక్ ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ నుంచి వచ్చి పేట్‌బషీరాబాద్‌లో ఓటు వేశారు. ఫ్యాక్చరైన కాలుతో ఒకాయన ఓటు హక్కు వినియోగించుకోగా... ఈ మేరకు వీడియోను ఆయన కుమారుడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దీనిని రీట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్... ఆయనను అభినందించారు.
ఇదీ చదవండి: గ్రేటర్ పోరు: నగరవాసుల బాధ్యతకు బద్ధకపు ముసుగు...!