పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు ఆందోళన చేపట్టాయి.
అనంతపురం జిల్లా కదిరిలో
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో జాతీయరహదారిపై వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు.
హిందూపురంలో
పెంచిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. హిందూపురం పట్టణంలో కాంగ్రెస్ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో రోడ్డుపై చెత్తని ఊడ్చి నిరసన తెలిపారు. పన్నులు పెంచి మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మోపడం సమంజసం కాదని మండిపడ్డారు. వెంటనే పన్నుల పెంపు విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిందూపురం పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వరరావుకు.. వినతిపత్రాన్ని అందించారు.
కడప జిల్లాలో
కడప జిల్లా రాయచోటిలో వామపక్ష నాయకులు.. తహసీల్దార్ కార్యాలయం నుంచి నేతాజీ కూడలి వరకూ ఇదే రీతిలో ఆందోళన చేశారు. ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ.. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీలో
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో.. సీపీఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు .ఆటోకు తాడు కట్టి రహదారిపై లాగుతూ నిరసన తెలిపారు.
ప్రకాశం జిల్లాలో
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మార్వో కార్యాలయం వద్ద వామపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లపై ధరలను పెంచడం చాలా దారుణమైన విషయమన్నారు.
కృష్ణా జిల్లా మైలవరంలో
పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ కృష్ణాజిల్లా మైలవరంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు వినూత్న నిరసన తెలిపారు. ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన వ్యక్తంచేశారు.
విజయవాడలో
పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని.. విజయవాడలో సీపీఎం, సీపీఐ ముఖ్యనేతలు రామకృష్ణ, మధు ఆందోళన చేపట్టారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేలా మోడీ విధానాలు ఉన్నాయన్నారు. మోడీ కనుసన్నల్లో జగన్ పాలన చేస్తున్నారన్నారు. అప్పు కోసం ప్రజల పై భారాలు మోపుతున్నారన్నారు. ఈ ధరలు తగ్గించక పోతే దేశ వ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్యామలా కూడలిలో.. వామపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
అమలాపురంలో
అమలాపురంలో వామపక్షాల పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో.. ఇతర సరుకుల ధరలు పెరిగిపోయి సామాన్యులు నలిగిపోతున్నారని ఆవేదన చెందారు. రోజురోజుకు చమురు ధరలు పెరిగిపోవడం దారుణమన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో
పెట్రోలు, డీజిల్, గ్యాస్,నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్లక్ష్య వైఖరి పాలన వల్లే ధరలు పెరిగాయని ధ్వజ మెత్తారు. నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.
కర్నూలు జిల్లాలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నులను వెంటనే తగ్గించాలని.. సీపీఎం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో.. కొండారెడ్డి బురుజు వద్ద పెట్రోల్ డిజిల్ ధరలు తగ్గించాలని ఆటోను తాడుతో లాగి నిరసన తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల కేంద్రంలో.. వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. పెంచిన చమురు ధరలు తగ్గించాలని.. వాహనాలు, గ్యాస్ సిలిండర్లను మోస్తూ నిరసన తెలిపారు.
పాలకొండలో
పాలకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న ప్రజలపై పెట్రోభారం మోపడం తగదని.. వామపక్ష నాయకులు అన్నారు.
ఇదీ చదవండి: Curfew: రాష్ట్రంలో ఈ నెల 30 వరకు కర్ఫ్యూ పొడిగింపు