కడప జిల్లాలో..
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 13,079 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 24.52 కోట్లు జమ కానున్నాయని ఆయన అన్నారు. మహిళలకు ఆర్థిక సుస్థిరతను కల్పించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పాటు అందించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు.
విజయనగరం జిల్లాలో...
విజయనగరం జిల్లా పార్వతీపురంలో వైఎస్సార్ చేయూత రెండో విడత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జోగారావు ప్రారంభించారు. నియోజకవర్గపరిధిలోని 16,522 మంది లబ్దిదారులకు 30.98కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు.
కృష్ణాజిల్లాలో...
కృష్ణాజిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే మెుండితోక జగన్మోహన్ రావు నమూనా చెక్కులను అందజేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో...
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళల జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పశ్చిమగోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మున్సిపల్ కార్యాలయంలో వైయస్సార్ చేయూత పథకాన్ని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో మహిళలకు 19 కోట్ల 66 లక్షల 50 వేల రూపాయల చేయూత నిధులు విడుదలయ్యాయని తెలిపారు.
కర్నూలు జిల్లాలో...
వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. 15,649 మంది మహిళలకు 29.34 కోట్ల రూపాయల చెక్కును మేయర్ బీవై రామయ్య, కమిషనర్ డీకే బాలాజీలు అందజేశారు.
విశాఖ జిల్లాలో...
రాష్ట్రంలో 45 నుంచి 60 సంవత్సరాలలోపు ఆడపడుచులను ఆదుకునేందుకు వీలుగా జగనన్న చేయూత పథకానికి శ్రీకారం చుట్టామని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించి 16,508 మందికి 30.90 కోట్ల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బిసీ మైనార్టీ వర్గాలకు చెందిన 13,943 మంది లబ్ధిదారులకు 26.14 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరుతుందని ఏపీఎం ఎం.డి వరాలబాబు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో పి గన్నవరం ఎంపీపీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహిళలు అధికారులు పాల్గొన్నారు.
జగ్గంపేట స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న అక్కాచెల్లెళ్ల భవితను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
ఇదీ చదవండి: