తన ఆస్తులను దౌర్జన్యంగా లాక్కోవడంతో పాటు చంపుతామని బెదిరిస్తున్నారని.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ లక్ష్మీనరసింహన్ ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తనకు ముఖ్యమంత్రి జగన్ రక్షణ కల్పించాలని కోరారు. స్వరాష్టంలో పలువురికి ఉపాధి కల్పించే నిమిత్తం.. చేపల చెరువును నడిపేందుకు కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని నందమూరులో 150 ఎకరాల్లో వ్యాపారం ప్రారంభించడం కోసం ఇద్దరు వ్యక్తుల దగ్గర లీజుకు తీసుకున్నామని చెప్పారు.
లీజుకు ఇచ్చిన వ్యక్తులే..
లాక్‌డౌన్‌ను ఆసరాగా తీసుకుని తనకు చేపల చెరువును లీజుకు ఇచ్చిన వ్యక్తులే రూ.60 వేలు కాదు రూ.90 వేలు డిమాండ్ చేయడంతో చేసేది లేక అందుకు అంగీకరించి 2023 వరకు లీజు ఒప్పందం చేసుకున్నామని వివరించారు. ఏప్రిల్ మాసంలో చేపలను విక్రయించుకునేందుకు సిద్ధమవ్వగా.. తనకు లీజుకు ఇచ్చిన వ్యక్తులే చాలా తక్కువ మొత్తానికి విక్రయించాలని డిమాండ్ చేశారని.. అందుకు అంగీకరించనందుకు తనను బెదిరించి దౌర్జన్యంగా 150 ఎకరాల్లోని రొయ్యలను తరలించుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు..
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎన్నోసార్లు తిరిగినప్పటికీ.. కనీసం ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని పేర్కొన్నారు. తనకు తెలిసిన వారి ద్వారా డీజీపీ గౌతం సవాంగ్‌ని కలిసి విన్నవించుకోగా.. ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్టోబర్‌లో కేసు నమోదు చేయించారని చెప్పారు. తమ విచారణలో తాను చెప్పిన విషయాలన్నీ వాస్తవాలని తేలినప్పటికీ నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం జగనే న్యాయం చేయాలి..
రాష్ట్రంలో దళితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి న్యాయం చేస్తున్నారని... తన గోడును ఆలకించి తనకు న్యాయం చేయాలని విన్నవించారు. ఒక మహిళా పారిశ్రామికవేత్తగా తాను స్వరాష్టం మీద ప్రేమతో పలువురికి ఉపాధి కల్పించడం కోసం ఇక్కడకు వచ్చి వ్యాపారాన్ని నిర్వహిస్తుంటే... అన్ని విధాలుగా అడ్డుకుని తన ఆస్తులు కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తనను చంపుతామని బెదిరిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండీ... వైకాపా దాడులు శ్రుతిమించిపోయాయి: చంద్రబాబు