రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించేందుకు నిర్వహించిన కృష్ణా నదీ యాజమాన్యబోర్డు సమావేశం వాడి, వేడిగా జరిగింది. రెండు రాష్ట్రాలు తమ వాదనలను గట్టిగా వినిపించాయి. వాదోపవాదాలు, చర్చల తర్వాత గత ఏడాది లాగానే తెలంగాణ 34 శాతం, ఆంధ్రప్రదేశ్ 66 శాతం నీటిని వినియోగించుకొనేలా కృష్ణా బోర్డు నిర్ణయించింది. 50 శాతం కేటాయించాలన్న తమ వాదనను మినిట్స్‌లో నమోదు చేయాలని తెలంగాణ కోరింది. శ్రీశైలం జల విద్యుత్తు ప్రాజెక్టే అని తెలంగాణ వాదించగా, ఆంధ్రప్రదేశ్ దీనికి భిన్నంగా వాదించింది. దీంతో దిగువన సాగు, తాగు అవసరాల మేరకే విద్యుదుత్పత్తి జరగాలని బోర్డు ఛైర్మన్ నిర్ణయం చెప్పడంతో ఏకపక్ష నిర్ణయమంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ... సమావేశం నుంచి వాకౌట్ చేసింది. కృష్ణా నదీ యాజమాన్యబోర్డు సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగింది. బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే, ఇతర సభ్యులు, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, రెండు రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజినీర్లు పాల్గొన్నారు.
నీటి వినియోగంపై జరిగిన సుదీర్ఘ చర్చలో రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 తీర్పు వచ్చేవరకు బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలలో 2015 జూన్‌లో జరిగిన తాత్కాలిక ఏర్పాటు కొనసాగుతుందని గత ఏడాది జరిగిన అపెక్స్ కౌన్సిల్ మినిట్స్‌లో ఉన్నందున, ప్రస్తుత నీటి సంవత్సరంలో కూడా గత ఏడాదిలాగానే వినియోగించుకునేలా నిర్ణయించినట్లు తెలిసింది. బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకొనేలా 2015లో తాత్కాలిక ఏర్పాటు జరిగింది. తర్వాత చిన్న నీటి వనరుల కింద వినియోగం, గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో 45 టీఎంసీలతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ 66 శాతం, తెలంగాణ 34 శాతం వాడుకునేలా మార్పు జరిగింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో చెరి 50 శాతం చొప్పున వినియోగం ఉండాలని తెలంగాణ కోరగా, 70:30 శాతంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. దీనిపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది.
వాటాపై వాదోపవాదాలు
బేసిన్ పరిధిలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ తదితర ప్రాజెక్టులు పూర్తయ్యి మొత్తం ఆయకట్టుకు నీరిస్తున్నందున అవసరాలు గణనీయంగా పెరిగాయని, 2018 నుంచి 50:50 నిష్పత్తిలో నీటి వినియోగం కోసం తెలంగాణ డిమాండ్ చేస్తోందని, 575 టీఎంసీలు కేటాయించాలని బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌ను కోరామని, ఈ ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు తాత్కాలికంగా ఈ ఏడాది నుంచే తాము కోరిన విధంగా నీటి వినియోగం జరగాలని తెలంగాణ కోరింది. ఆంధ్రప్రదేశ్ కోరినట్లుగా 70:30 శాతానికి అంగీకరించబోమని స్పష్టం చేసింది. పక్క బేసిన్‌కు మళ్లించకూడదని బచావత్ ట్రైబ్యునల్ చెప్పలేదంటూ ఇందుకు సంబంధించిన వివరాలు అందజేయడంతోపాటు తమ వాటా నీటిని ఎక్కడైనా వినియోగించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ వాదించింది. గోదావరి నుంచి కృష్ణాలోకి ఆంధ్రప్రదేశ్ మళ్లించడం ద్వారా వచ్చే 45 టీఎంసీలలో వాటా అంటే, తెలంగాణ గోదావరి నుంచి కృష్ణాలోకి 215 టీఎంసీలు మళ్లిస్తుందని తెలిపింది. ఈ అంశంపై వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులుగా గల అపెక్స్ కౌన్సిల్ గత అక్టోబరులో జరిగిన సమావేశంలో... కృష్ణా ట్రైబ్యునల్-2 తీర్పు వచ్చే వరకు 2015-16లో జరిగిన తాత్కాలిక ఏర్పాటు కొనసాగుతుందని పేర్కొన్నందున ప్రస్తుత ఏడాది కూడా ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతం నీరు వినియోగించుకునేలా నిర్ణయం జరిగింది. తాము 50:50 వినియోగం ఉండాలని కోరిన విషయం కూడా అందులో ఉండాలని తెలంగాణ కోరగా, బోర్డు అంగీకరించినట్లు తెలిసింది. ఈ అంశంపైనే రెండుగంటలకు పైగా చర్చ జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కృష్ణాబోర్డు సమావేశం, తర్వాత రాత్రి వరకు రెండు బోర్డుల సంయుక్త సమావేశం జరిగాయి. బుధవారం రాత్రి వరకు కృష్ణా బోర్డు నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
విద్యుదుత్పత్తిపై
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిపైనా చర్చ జరిగింది. శ్రీశైలాన్ని జల విద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రణాళికాసంఘం ఆమోదం తెలిపిందని, విద్యుదుత్పత్తి ద్వారా 180 టీఎంసీలను నాగార్జునసాగర్ జలాశయానికి పంపాల్సి ఉందని, బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ కూడా ఇదే విషయాన్ని చెప్పిందని తెలంగాణ పేర్కొంది. తాము విద్యుదుత్పత్తి కొనసాగిస్తామని, ఏపీ కూడా ఉత్పత్తి చేసుకోవడానికి అభ్యంతరం లేదంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ఏకీభవించలేదు. దిగువన సాగు, తాగు అవసరాల ప్రకారమే విద్యుదుత్పత్తి చేయాలని పేర్కొంది. విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని కోరింది. ఇరువాదనలు విన్న తర్వాత విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని, సాగు, తాగు అవసరాలకు తగ్గట్లుగానే చేయాలని బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ స్పష్టం చేయడంతో నిరసనగా తెలంగాణ వాకౌట్ చేసింది.
చిన్ననీటి వనరుల కింద వాడుకోని నీరు ఇతర ప్రాజెక్టులకు...
బచావత్ ట్రైబ్యునల్ మైనర్ ఇరిగేషన్ కోసం కేటాయించిన 90.833 టీఎంసీలలో వాస్తవ వినియోగం 48.833 టీఎంసీలేనని, మిగిలిన 42 టీఎంసీలను ప్రస్తుత సంవత్సరం నుంచి ఇతర ప్రాజెక్టులకు వినియోగించుకొంటామని తెలంగాణ బోర్డు దృష్టికి తెచ్చింది. హైదరాబాద్ తాగునీటికి, మిషన్ భగీరథకు వినియోగించుకొనే నీటిలో బచావత్ ట్రైబ్యునల్ తీర్పు మేరకు 20 శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ కోరింది. హైదరాబాద్ తాగునీటికి తరలించే 16.5 టీఎంసీలలో లెక్కలోకి తీసుకోవాల్సిన 3.3 టీఎంసీలు పోను, 13.2 టీఎంసీలు ఈ సంవత్సరం నుంచి వాడుకుంటామని, గోదావరి నుంచి మళ్లించే నీటిలో 45 టీఎంసీలను ఈ సంవత్సరం నుంచి నాగార్జునసాగర్ ఎగువన వినియోగించుకుంటామని తెలంగాణ పేర్కొంది. పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమ తరలింపును నిలిపివేయాలని, ఇప్పటికే 63.5 టీఎంసీలను తరలించారని, ఇలా మొత్తం 12 అంశాలతో బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ లేఖ ఇచ్చారు. ఈ అంశాలతో ఆంధ్రప్రదేశ్ ఏకీభవించలేదని తెలిసింది.
క్యారీ ఓవర్‌పై...
కేటాయించినా వినియోగించుకోలేని మా వాటా నీటిని నిల్వ ఉంచుకొని... తర్వాత సంవత్సరం వాడుకొంటే తప్పేంటని తెలంగాణ ప్రశ్నించింది. దీనికి అనుమతించాలని కోరింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా నిల్వ ఉంచిన నీటిని గత సంవత్సరం లెక్కలో కాకుండా వినియోగించుకున్న సంవత్సరంలోనే లెక్కకట్టాలని కోరింది. మీ వాటా నీటిని తెలంగాణలోని రిజర్వాయర్లలో ఉంచి వాడుకొంటే అభ్యంతరం లేదంది. ఈ సమయంలో బోర్డు ఛైర్మన్ జోక్యం చేసుకొని ఉమ్మడి రిజర్వాయర్లలో నిల్వ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా, ఆ సంవత్సరం వచ్చే నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా అని పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై చర్చ జరిగిన తర్వాత గతంలో లాగానే కొనసాగాలని, ఈ సంవత్సరం కేటాయించిన నీటిని ఉమ్మడి రిజర్వాయర్లలో నిల్వ చేసి తర్వాత సంవత్సరం వాడుకోవడానికి లేదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.
మిగులు జలాల వినియోగంపై...
రిజర్వాయర్లు పూర్తిగా నిండి వరద ప్రవాహం ఉన్నప్పుడు వినియోగించుకొనే నీటిని పరిగణనలోకి తీసుకోరాదన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనపై సుదీర్ఘ చర్చ జరిగింది. సముద్రంలోకి పోయే నీటిని వాడుకొంటే తప్పేంటని, బచావత్ ట్రైబ్యునల్‌తో పాటు నర్మదా తదితర ట్రైబ్యునళ్ల తీర్పులో కూడా ఈ అంశం ఉందని ఆంధ్రప్రదేశ్ పేర్కొనగా, దీనిపై తెలంగాణ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాదనల తర్వాత వరద నీటిని వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్ తాగునీటికి 16.5 టీఎంసీలు, మిషన్ భగీరథకు వాడే 23.5 టీఎంసీలలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంపై చర్చ జరగ్గా, ఏపీ అంగీకరించలేదని తెలిసింది. చివరకు పరస్పర అంగీకారంతో తాగునీటికి అవసరమైనప్పుడు తీసుకోవడానికి నిర్ణయించినట్లు తెలిసింది.
మిగులు జలాల వినియోగానికి అంగీకారం
దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా మిగులు జలాలను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. తెలంగాణకు కూడా అవకాశం ఉంది. కేటాయింపుల్లో మిగులు వినియోగం వాటాను చేర్చొద్దన్న ఏపీ విజ్ఞప్తికి బోర్డు అంగీకరించింది. కృష్ణా బోర్డు సమావేశంలో చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేసి 100 టీఎంసీలను తెలంగాణ దిగువకు వదిలేయడంతో నీరంతా సముద్రంలోకి పోయింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేడబ్ల్యూడీటీ-1, కేంద్ర జలసంఘం నిబంధనలు పాటించాలి. వరదల సమయంలో మిగులు జలాలు వినియోగించుకుంటే లెక్కలోకి తీసుకోవాలన్న తెలంగాణ ఫిర్యాదుపై చర్చ జరిగింది. 512 టీఎంసీల కేటాయింపుల్లో కాకుండా మిగులు నీటిని వినియోగించుకునేందుకు ఏపీ అనుమతి కోరగా బోర్డు అంగీకరించింది. వినియోగం లెక్కలను నమోదు చేయాలని సూచించింది. ఇది తెలంగాణకు కూడా వర్తిస్తుంది. రెండు బోర్డుల సంయుక్త సమావేశంలో గెజిట్ నోటిఫికేషన్లపై చర్చలో ఏపీ పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశాం. కొత్త ప్రాజెక్టుల పేరుతో డీపీఆర్‌లు అడగడం సరికాదని చెప్పాం. విభజన చట్టం ఆమోదించిన మేరకు నాలుగు ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తిచేసినవి. వెలిగొండకు బదులు వెలిగోడు అని జాబితాలో తప్పుగా చేర్చారు. దాన్ని సరిచేయాలని కోరాం. -శ్యామలరావు, ఏపీ జల వనరులశాఖ కార్యదర్శి