ఈనెల 22 న జరగనున్న కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తెదేపా ఎంపీ కేశినేని శ్రీనివాస్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నాని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించాలని కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్, సహాయ ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఫలితాలను మాత్రం ప్రకటించొద్దని సంబంధిత అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23 కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 22 న జరగనున్న కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో సభ్యునిగా ఓటు హక్కు వేసేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడ ఎంపీ కేశినేని నాని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి చట్టంలో నిషేధం లేదన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కోఆప్టెడ్ సభ్యునిగా పిటిషనర్ ఐచ్ఛికం ఇచ్చినప్పటికీ .. ఆ మేరకు ప్రమాణం చేయాలనుకోలేదన్నారు . ఈ నేపథ్యంలో కొండపల్లి చైర్మన్ ఎన్నికలో పాల్గొనే హక్కు ఉందన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీ కేశినేని నానికి వెసులుబాటు ఇచ్చారు.
రసవత్తరంగా కొండపల్లి పురపాలక సంఘం ఛైర్మన్ పీఠం
కొండపల్లి పురపాలక సంఘం నూతన ఛైర్మన్ పీఠం కోసం పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఈ నెల 17వ తేదీన పుర ఫలితాలు విడుదలవ్వడం, అందులో 14 తెదేపా, 14 వైకాపా, ఒక్కరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం తెలిసిన విషయమే. గెలిచిన స్వతంత్ర అభ్యర్థి తెదేపాలో చేరడం నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయింది. ఇప్పుడు ఛైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకొనే అంశం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి అండతో తెదేపా ఆ పీఠాన్ని కైవసం చేసుకొంటుందా..? లేక ఇతర ప్రయత్నాలు సఫలమై వైకాపా సొంతం చేసుకొంటుందా? అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సమయంలో ఎక్స్ అఫీషియా ఓటు ప్రస్తావన తెర పైకి వచ్చింది. ఎక్స్ అఫీషియో సభ్యుడి ఓటు కీలకంగా మారడంతో రాజకీయం మరింత వేడెక్కింది. మరోవైపు గోడమీద పిల్లి వాటం కలిగిన గెలుపొందిన అభ్యర్థుల కోసం ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొన్న ఇరుపార్టీల పెద్దలు రాత్రికి రాత్రే 29 మంది అభ్యర్థులను కొండపల్లి పురపాలిక పరిధి నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఛైర్మన్ పీఠం కోసం ప్రయత్నించే వారి చరవాణి తప్ప ఇతరుల ఫోన్లు పనిచేయడం మానేశాయి. గోడ దూకే అభ్యర్థికి భారీగా ఆఫర్లు వస్తున్నాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నెల 22న ఛైర్మన్ ఎంపిక జరగనున్న నేపథ్యంలో ఆ రోజే అభ్యర్థులంతా కొండపల్లికి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట అందోళన
ఎక్స్ అఫిషియో ఓటుకు ఎంపీ దరఖాస్తు చేసుకుందామంటే మున్సిపల్ కమిషనర్ అందుబాటులో ఉండట్లేదంటూ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. కమిషనర్ వెంటనే కార్యాలయానికి రావాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
ఇదీ చదవండి: తిరిగొచ్చిన.. తిరుగుబాటుదారు బలం