Kodali react on Lokesh comments: ‘పదోతరగతి ఫెయిలైన విద్యార్థులను ఇక మీరెందుకూ పనికిరారన్నట్లుగా మాట్లాడి, వారిని ఆత్మహత్యల వైపు ప్రేరేపించేలా లోకేశ్ చేస్తున్నారని... దాన్ని అడ్డుకుని, రాజకీయ లబ్ధి కోసం పిల్లలను బలిచేయవద్దని చెప్పాలనే లోకేశ్ జూమ్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లాం’ అని మాజీమంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. ‘మేం నేరుగా జూమ్ సమావేశంలో పాల్గొంటామంటే లోకేశ్ ఉంటారా? అందువల్లే పిల్లల తరఫున వెళ్లాం. సమావేశంలో ప్రభుత్వం తరఫున మా వాదనా వినాలి కదా?’ అని చెప్పారు. వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇంటివద్ద వారు మీడియాతో మాట్లాడారు.
అందుకే వెళ్లాం: కొడాలి నాని: ‘రెండేళ్లు కరోనా సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు లేక.. తరగతులను ఆన్‌లైన్‌లో వినలేకపోయారు. ఫెయిలైనంత మాత్రాన వారి జీవితాలు నాశనమవలేదు. నెల రోజుల్లో మళ్లీ పరీక్ష పెడతాం. రెగ్యులర్‌గా పాసయినట్లే ధ్రువీకరణ పత్రాలు ఇస్తాం. గతేడాది పాఠశాలలు తెరవాలని సీఎం జగన్ నిర్ణయిస్తే వద్దని అడ్డుకుంది లోకేశ్ కాదా? ఇప్పుడొచ్చి పరీక్ష ఫలితాలు పడిపోయాయంటూ రాజకీయం చేస్తున్నారు’ అన్నారు.
చదువు కొన్న లోకేశ్‌కు తెలుసు: ‘చదువుకున్న వారికి, చదువు కొన్నవారికి తేడా ఏంటో స్టాన్‌ఫర్డ్‌లో చదువు కొన్న లోకేశ్‌కు బాగా తెలుసు’ అని వంశీ అన్నారు. ‘24పేజీలు రాస్తే 6 మార్కులు వేశారని లోకేశ్ జూమ్ మీటింగ్‌లో ఒక అమ్మాయి చెప్పింది. మూల్యాంకనంలో ఇలాంటి సమస్యల పరిష్కారానికి సూచనలు చేసి, వాటిని ప్రభుత్వం పట్టించుకోకపోతే అప్పుడు మాట్లాడాలి. ఇవేమీ లేకుండా రాజకీయ లబ్ధి కోసం పిల్లలను లోకేశ్ ప్రేరేపిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి