స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి... మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్‌కు లేఖ రాశారు. దాడులు, దౌర్జన్యాలతో అధికార పార్టీ చాలాచోట్ల ఏకగ్రీవం చేసుకుందని... వారికి అధికారులు, పోలీసులు సహకరించారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దౌర్జన్యకాండ ఎప్పుడూ జరగలేదని... స్థానిక ఎన్నికల ప్రక్రియ మళ్లీ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కన్నా కోరారు.
భూదోపిడీలు పెరిగిపోయాయి...
రాష్ట్రంలో భూదందాలు, దోపిడీకి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువయ్యాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ బిశ్వభూషణ్ కు లేఖ రాశారు. ఇటీవల కాలంలో విశాఖపట్నంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయని లేఖలో వెల్లడించారు. గతంలో లులు గ్రూప్ కి కేటాయించిన భూమిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం....సీఎంఆర్ గ్రూపుకు కేటాయించిన భూమిని మాత్రం రద్దు చేయలేదన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలు, అక్రమాలపై ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్న కన్నా....ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంలో సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విషయంలో నిష్పాక్షికంగా విచారణ జరిపి...ప్రజలకు భద్రత కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు కన్నా విజ్ఞప్తి చేశారు.
ర్యాపిడ్ కిట్ల కొనుగోలు వ్యవహారం పై విచారణ జరపాలి..
ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలులో ఆర్థిక ప్రయోజనం పొందడం కోసం ప్రభుత్వం మధ్యవర్తిని నియమించిందని కన్నా ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాసిన ఆయన....దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై లేఖలో పేర్కొన్నారు. కరోనా పేరుతో కిట్ల కొనుగోలులో ఖజానాకు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందన్న కన్నా....పారదర్శక విధానాన్ని విస్మరించి తక్షణ సేకరణ సాకుతో ఆర్థిక ప్రయోజనం పొందడం కోసం మధ్యవర్తి ద్వారా కొనుగోలు చేసిందన్నారు. ఛత్తీస్‌ఘడ్ ఆరోగ్య మంత్రి ట్వీట్ ద్వారా ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయన్న కన్నా....రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన విధానం చట్టవిరుద్ధమన్నారు. ఉద్దేశపూర్వకంగానే కొనుగోలు ఆర్డర్ ఇచ్చారని....ఈ విషయంలో పారదర్శకత నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని కోరినా...ఎలాంటి స్పందన లేదని లేఖలో పేర్కొన్నారు. ఈ మొత్తం లావాదేవీలను పరిశీలించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి...'కర్నూలులో పర్యటించే ధైర్యం ఉందా సీఎం గారూ?'