విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదయితే, కమీషన్లు దండుకుంటున్న ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. వైకాపా ప్రభుత్వం చేతకాని పాలనతో 2 ఏళ్లలోనే విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లుపెట్టి అన్నదాతల్ని అప్పుల పాలు చేయొద్దని కోరారు. మాట ఇవ్వడం మోసం చేయడం జగన్ రెడ్డికి దిన చర్యగా మారిందని కళా వెంకట్రావు విమర్శించారు.
ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పి, అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే మూడుసార్లు పెంచి ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ రేట్లు ఒక్క పైసా కూడా పెంచలేదని.. మిగులు విద్యుత్ సాధించి 24 గంటల కరెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. నేడు వైకాపా ప్రభుత్వ చేతకానిపాలన, అనాలోచిత నిర్ణయాలతో కరెంట్ కోతలు, విద్యుత్ బిల్లుల మోతలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని కళావెంకట్రావు దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
బచావత్ ట్రైబ్యునల్ తీర్పుపై సమీక్ష చట్టవిరుద్ధం: కేంద్రానికి ఏపీ లేఖ