వైద్యుల సేవా అంశాలు, బదిలీలు, పదోన్నతులను జాయింట్ కలెక్టర్-2 చేతిలో పెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.64ను ఉపసంహరించుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు. ప్రభుత్వ వైద్యుల గౌరవాన్ని తగ్గించే ఉత్తర్వులు సరికాదని హితవు పలికారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, మందుల సరఫరాపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం వైద్యులపై పెత్తనం చేయటం సరికాదన్నారు.
రోగులకు మెరుగైన సేవలను అందించేందుకే ఆస్పత్రుల నిర్వహణ అంశాన్ని వైద్యుల పరిధిలో ఉంచారని ఆయన పేర్కొన్నారు. ఈ జీవో ఫలితంగా ఆస్పత్రుల నిర్వహణ నుంచి రోగుల సేవల వరకూ ఏ విషయంలోనైనా తక్షణ నిర్ణయాలకు జూనియర్ ఐఏఎస్ అధికారి అనుమతి కోసం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనివల్ల ప్రభుత్వాస్పత్రులకు వెళ్లే పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదన్నారు. అనుభవం ఉన్న వైద్యుడిని గ్రూప్1 హోదాలో జిల్లా స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా నియమించాలని నిబంధనలు చెబుతున్నా ఆ పోస్టును భర్తీ చేయడటం లేదని మండిపడ్డారు. తమ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలు, అవసరాల గురించి ఐఏఎస్, రెవెన్యూ అధికారులకు ఎంతమేర అర్థమవుతుందని ఆయన ప్రశ్నించారు.
కొవిడ్ రోగులకు కావాల్సిన అత్యవసర ఔషధాలు, ఇంజక్షన్లు ప్రభుత్వం సరిగ్గా అందించలేకపోయిందని విమర్శించారు. కీలక బాధ్యతలను వదిలిపెట్టి వైద్యుల విధుల్లో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. డీఎమ్ అండ్ హెచ్ఓ నియమాకాల్లో రాజకీయ ప్రమేయాన్ని తొలగించాలని వైద్యులు కోరుతుంటే... వైకాపా ప్రభుత్వం జీవో 64 జారీ చేయటాన్ని జనసేన పార్టీ ఖండిస్తుందన్నారు. తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని పార్టీ తరఫున డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: CM Letter To PM: 'ప్రైవేటు ఆస్పత్రులు వాడని కొవిడ్ వ్యాక్సిన్లను ప్రభుత్వం సేకరించాలి'