జనసేన విధి విధానాలు, సిద్ధాంతాలకు కట్టుబడి... శ్రేణులతో మమేకమవుతూ ఒత్తిళ్లు, కష్టనష్టాలను తట్టుకునే నాయకులతో కలిసి పనిచేస్తానని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ దిశగా మరో అడుగు ముందుకేసి పార్టీకి సంబంధించిన కీలక కమిటీలకు తుది రూపం ఇచ్చారు. పొలిట్ బ్యూరోలో నాదెండ్ల మనోహర్, రామ్మోహన్రావు, రాజు రవి తేజ్, అర్హం ఖాన్ను నియమించారు.
నాదెండ్ల.. తోటకు కీలక బాధ్యతలు
పొలిటికల్ అఫైర్స్ కమిటీకి నాదెండ్ల మనోహర్ ఛైర్మన్గా నియమితులయ్యారు. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్... పార్టీ జనరల్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. క్రమశిక్షణ సంఘం ఛైర్మన్గా మాదాసు గంగాధరాన్ని నియమిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన యువ అభ్యర్థులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు సైతం పవన్ నిర్ణయించారు.
త్వరలో క్షేత్ర స్థాయి పర్యటన
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలో క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యువత, అనుభవజ్ఞులైన నాయకులను కలుపుకొని ఈ పర్యటనలు చేపట్టనున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి ఏ విధంగా పరిష్కరించి...ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలి అనే పంథాలో ఈ పర్యటన సాగనుంది. పార్టీలో యువ నాయకత్వాన్ని బలోపేతం చేసి, వారిని సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో మందుకు వెళ్లేలా దిశానిర్దేశం చేయనున్నారు.
జనసేన కమిటీలకు నిర్దేశించిన బాధ్యతలను ఎప్పటికప్పుడు సమీక్షించడంతోపాటు, క్షేత్ర స్థాయిలో ఆ కమిటీల ప్రభావం, పని తీరును పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు. మరోవైపు జనసేన పార్టీ పక్షాన త్వరలో ఒక సంచికను తీసుకురానున్నారు. సామాజిక, రాజకీయ పత్రికగా ఇది రూపుదిద్దుకోనుంది.