తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రెస్ మీట్లో సీఎం కేసీఆర్(CM KCR) చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై గజేంద్ర సింగ్ షెకావత్ ఘాటుగా స్పందించారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డులపై సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్ చేస్తున్నది అంతా ఒక డ్రామా అని విమర్శించారు.
తెలంగాణ, ఏపీ మధ్య నీటిపంపకాల కోసం కొత్త ట్రైబ్యునల్ కోసం సీఎం కేసీఆర్(CM KCR) అడిగారని వెల్లడించారు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసు వెనక్కి తీసుకునేందుకు దాదాపు ఎనిమిది నెలలు పట్టిందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat)అన్నారు. కోర్టులో కేసు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశానికి నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
అపెక్స్ కౌన్సిల్లో చర్చించాం
ఇద్దరు సీఎంలతో కలిసి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిందని తెలిపారు. చాలా కాలం నుంచి జరగాల్సిన సమావేశాన్ని చొరవ తీసుకుని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ భేటీలో కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై ఇద్దరితో చర్చించినట్లు పేర్కొన్నారు. రెండ్రోజుల్లోనే సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ వెనక్కి తీసుకుంటానన్న సీఎం కేసీఆర్‌కు ఎనిమిది నెలలు పట్టిందన్నారు. అప్పటి నుంచే కేంద్రం నిర్వర్తించాల్సిన కార్యక్రమం మొదలైందని తెలిపారు. ఏడేళ్లు ఆలస్యం కావడానికి నేను, కేంద్రం ఎలా బాధ్యత వహిస్తుందని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశ్నించారు.
ఒకరిపై మరొకరు ఆరోపణలు
రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందనిగజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat) అన్నారు. జల వివాదంపై ప్రధాని కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారని తెలిపారు. బోర్డుల పరిధి నోటిఫై కానంత వరకు బాధ్యతలు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు.
ఇద్దరు సీఎంలు ఒప్పుకున్న తర్వాతే బోర్డుల పరిధిని నోటిఫై చేసినట్లు ఆయన వెల్లడించారు. ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం కేసీఆర్ పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదించిన అంశాలపై ఇష్టారీతిన ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. నదుల నుంచి ఎవరికి నచ్చినట్లుగా వారు నీటిని వాడుకుంటున్నారని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat)ఆరోపించారు.
కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నాం
కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. అవకాశం ఉన్నంత మేరకు ట్రైబ్యునల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య మాత్రమే ఉన్న వివాదమన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు. న్యాయ మంత్రిత్వ శాఖ అభిప్రాయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్ అమలు విషయంలో సమన్వయంతో వెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై నియమనిబంధనలను కేంద్ర జల్‌శక్తిశాఖ రూపొందిస్తుందని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: CBN on Municipal Elections: ఫేక్ సీఎం..ఫేక్ సంతకాలతో తనవారిని గెలిపించుకున్నారు: చంద్రబాబు