అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ టెక్‌జోన్ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ వెల్లడించాక.. డిశ్ఛార్జి పిటిషన్‌లో వాదనలు వినిపిస్తామంటూ వె.ఎస్.జగన్ మంగళవారం సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఇందూ టెక్‌జోన్ కేసులో దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై మంగళవారం వాదనలు ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. దర్యాప్తు పూర్తయిందని సీబీఐ వెల్లడిస్తే వాదనలు వినిపిస్తామంటూ జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి మెమో దాఖలు చేశారు.
సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో.. కోర్టు అనుమతితో అదనపు సాక్షుల వాంగ్మూలాలు, ఇతర పత్రాలను సమర్పిస్తామని పేర్కొందని, ఇప్పుడు తాము వాదనలు ప్రారంభించాక వాటికి అనుగుణంగా డాక్యుమెంట్‌లు సమర్పిస్తుందని పేర్కొన్నారు. గతంలో జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, పెన్నా సిమెంట్స్ కేసుల్లో తాము పిటిషన్లు వేశాక పబ్లిక్ సర్వెంట్‌గా విజయసాయిరెడ్డిని చేర్చుతూ అనుబంధ అభియోగ పత్రాలు దాఖలు చేసిందన్నారు. అంతకుముందు ఈ కేసుల్లోని నిందితుల్లో పబ్లిక్ సర్వెంట్ లేరన్నారు. గత సంఘటనల నేపథ్యంలో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ వెల్లడించాల్సి ఉందని పేర్కొన్నారు.
దర్యాప్తుస్థాయిని తెలుసుకోవడానికి రెండు రోజులు గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరడంతో విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్ కేసులో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లలో కౌంటర్లు దాఖలు చేయడానికి, రఘురాం (భారతి) సిమెంట్స్‌లో వాదనలు వినిపించడానికి గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరడంతో కోర్టు అనుమతిస్తూ విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: గాయపడిన విద్యార్థులను నేడు పరామర్శించనున్న నారాలోకేశ్